ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంతో చేస్తున్నాం.. వైసీపీకి ఓటు వేయకుంటే తప్పు చేసినట్లే : మంత్రి జోగి రమేశ్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Oct 28, 2022, 02:29 PM IST
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంతో చేస్తున్నాం.. వైసీపీకి ఓటు వేయకుంటే తప్పు చేసినట్లే : మంత్రి జోగి రమేశ్ వ్యాఖ్యలు

సారాంశం

వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు వైసీపీకి ఓటు వేయకుంటే తప్పు చేసినవారు అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేశ్. బడుగు , బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం చేస్తోందన్నారు.

వైసీపీ సీనియర్ నేత, మంత్రి జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరు వద్ద రూ.44 కోట్లతో నిర్మించనున్న అమరావతి- తుళ్లూరు రహదారి, పెదమద్దూరు వాగుపై వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. బడుగు , బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం చేస్తోందన్నారు. ఇంత మేలు చేస్తున్నందున వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే తప్పు చేసినవారు అవుతారని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను పవన్ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 10 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో కృష్ణానదిపై త్వరలోనే వంతెనను నిర్మించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని జోగి రమేశ్ స్పష్టం చేశారు. 

ఇకపోతే .. గురువారం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పాలనలో బీసీలను అణచివేయడమేనని విమర్శించారు. బీసీలను బలి తీసుకుంటున్న విజయసాయరెడ్డి ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఏంటని యనమల ప్రశ్నించారు. రాష్ట్రంలోని కీలక పదవుల్లో తెలుగుదేశం పార్టీ బీసీలను నియమించిందని ఆయన గుర్తుచేశారు. కానీ మూడున్నరేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీలకు ఇక్కట్లు తప్ప మరేమీ లేవని రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. చివరికి నామినేటెడ్ పదవుల్లోనూ టీడీపీ బీసీలకు పెద్ద పీట వేస్తే.. ఇప్పుడు మొత్తం రెడ్లే కనిపిస్తున్నారని యనమల దుయ్యబట్టారు. 

Also REad:ఫ్యాక్షనిస్ట్ నోట.. సోషలిస్ట్ మాట, ఎక్కడ చూసినా రెడ్ల హవాయే : జగన్‌పై యనమల ఆగ్రహం

ఆవిర్భావం నుంచి బీసీలంతా టీడీపీకి అండగా నిలిచారని.. అందుకే వారిపై వైసీపీ ప్రభుత్వం దాడులకు దిగుతోందని రామకృష్ణుడు ఆరోపించారు. రిజర్వేషన్లను కుట్రపూరితంగా కుదించారని ఆయన దుయ్యబట్టారు. జగన్ కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరని.. అలాంటి వ్యక్తి సోషలిస్ట్‌గా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై జగన్ రెడ్డి మోసాలు, దుర్మార్గాలకు త్వరలోనే శుభం కార్డు వేసి.. నియంతృత్వాన్ని సమాధి కట్టడం తథ్యమని యనమల జోస్యం చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?