శత్రువులైనా క్షేమం కోరుకుంటాం, మాకేం అవసరం : పవన్ హత్యకు కుట్రపై జోగి రమేశ్ స్పందన

Siva Kodati |  
Published : Nov 03, 2022, 05:45 PM IST
శత్రువులైనా క్షేమం కోరుకుంటాం, మాకేం అవసరం : పవన్ హత్యకు కుట్రపై జోగి రమేశ్ స్పందన

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కొందరు రెక్కీ నిర్వహిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై మంత్రి జోగి రమేశ్ స్పందించారు. వైసీపీకి ఎవరిపైనా రెక్కీలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. శత్రువులు కూడా బాగుండాలని తాము భావిస్తామని మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు.

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కొందరు కుట్ర పన్నారని, హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించినట్లుగా వస్తున్న వార్తలపై స్పందించారు మంత్రి జోగి రమేశ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి ఎవరిపైనా రెక్కీలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. శత్రువులు కూడా బాగుండాలని తాము భావిస్తామని మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు. అటు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌పై ఆయన స్పందించారు . అయ్యన్నపాత్రుడు 420 పనిచేస్తే బీసీలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంత లేపినా టీడీపీ లేవదని.. బీసీలను రెచ్చగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని జోగి రమేశ్ ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే కేసు పెట్టకూడదా అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీకి సొంత రాజ్యాంగం ఏమైనా రాశారా అని జోగి రమేశ్ నిలదీశారు. 

ఇకపోతే.. పవన్ కల్యాణ్‌ను అనుమానాస్పద వ్యక్తులు అనుసరించడంపై జనసేన పార్టీ నేతలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు  చేసినట్టుగా ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘‘ఈ మధ్య పవన్ కల్యాణ్‌ను అనుమానాస్పద వ్యక్తులు ఎక్కువగా అనుసరిస్తున్నారు. విశాఖ సంఘటన తరువాత పవన్ కల్యాణ్‌ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు తచ్చాడుతున్నారు. పవన్ కల్యాణ్‌ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారు. కారులోని వ్యక్తులు పవన్ కల్యాణ్‌ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుసరిస్తున్న వారు అభిమానులు కాదని పవన్ కల్యాణ్‌ వ్యక్తిగత రక్షణ సిబ్బంది చెబుతున్నారు. 

ALso Read:పవన్ కల్యాణ్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదు.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  బుధవారం కారులో, మంగళవారం నాడు ద్విచక్రవాహనాలపై అనుసరించారు. కాగా సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కల్యాణ్‌ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు. ఇంటికి ఎదురుగా వారు కారు ఆపారు. సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ, పవన్ కల్యాణ్‌ను దుర్భాషలాడుతూ గొడవ చేశారు. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఆయినా సంయమనం పాటించిన సిబ్బంది.. ఈ సంఘటనను వీడియో తీసి జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్‌కు అందించగా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు పిర్యాదు చేశారు’’అని నాదెండ్ల మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్