
ఏపీలో సీఐడీ ఆఫీసు టార్చర్ ఆఫీసుగా మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. విశాఖలో భూకబ్జాలపై పోరాడినందుకు అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అయ్యన్న ఇంటికి అర్ధరాత్రి వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ‘‘మీ బాబాయ్‌ను మీరు హత్య చేసినట్టుగా.. ఆయన ఏమైనా హత్య చేశారా’’ అని ప్రశ్నించారు. చెప్పులు కూడా వేసుకోనియకుండా లాక్కుని వెళ్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు తప్పుడు విధానాలతో మందుకు వెళ్తున్నారని విమర్శించారు.
జలవనరుల శాఖ ఈఈని బెదిరించి అయ్యనపాత్రుడిపై తప్పుడు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసు అధికారి శంకయ్య తొలుత సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చారని.. ప్రభుత్వం నుంచి పదోన్నతి పొందాక మాట మార్చారని అన్నారు. వివేకా హత్య విషయంలో జగన్ సోదరి షర్మిల సీబీఐ వాంగ్మూలం ఇవ్వడం, విశాఖపట్నంలో భూ కబ్జాలు, సెటిల్‌మెంట్స్.. వీటిపై దృష్టి మళ్లించేందుకు అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
సీఎం జగన్ మేనమామ వాగును అక్రమించి థియేటర్ కట్టుకున్నారని ఆరోపించారు. వైఎస్ కుటుంబం ఇడుపులపాయలో వందల ఎకరాలు అక్రమించుకుందని ఆరోపించారు. 2 సెంట్ల భూమి అక్రమించారనే ఆరోపణలపై అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయడం దుర్మార్గం అని విమర్శించారు. వైఎస్ కుటుంబం అక్రమాలపై తాను ఫిర్యాదు చేస్తానని.. చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
వైసీపీ పాపాలే వారికి శాపాలుగా మారతాయని అన్నారు. ఎన్నికలైన వెంటనే జగన్ జైలుకు.. వైసీపీ బంగాళాఖాతంలోకి కలుస్తుందని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు కుమారుడు రాజేష్‌ను కొట్టారని తమకు సమాచారం ఉందని అన్నారు. తప్పుడు పనులు చేస్తున్న అధికారులపై కచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరించారు. సాక్షలును ప్రభావితం చేసే శక్తి ఉందని అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేస్తారా ప్రశ్నించారు. వివేకా హత్య కేసు సాక్షులను ప్రభావితం చేస్తున్న సీఎం జగన్‌ను అరెస్ట్ చేయగలరా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై ఓ కార్యక్రమం చేపట్టి.. ప్రజల్లోకి వెళ్తామని అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అందరినీ చంపేస్తారా?.. జైలులో పెట్టేస్తారా?.. జైలులో టార్చర్ చేస్తారా? అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై దాడులు చేద్దామనుకుంటారా? ఎవరినీ బతకనివ్వరా..? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రిటైర్డ్ అధికారులను పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.