
విశాఖపట్నం: తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శలు గుప్పించారు. ఉండవల్లి శ్రీదేవి అనే కంటే ఊసరవెల్లి శ్రీదేవి అని ఆమె పేరు మార్చుకుంటే బెటర్ అని విమర్శించారు. సినీ నటి శ్రీదేవి కంటే.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నటన అద్భుతంగా ఉందని సెటైర్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశానని నమ్మించేందుకు ఎమ్మెల్యే శ్రీదేవి నటించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే ముందు శ్రీదేవి ఆమె కూతురుని సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లి ఫొటో దిగారని.. ఆయన అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల రోజు ఆమె ఎంత హడావిడి చేశారో అందరూ చూశారని అన్నారు.
ఎమ్మెల్యే శ్రీదేవి నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఇప్పుడెలా బయటకు వచ్చాయని ప్రశ్నించారు. ఊసరవెల్లిలు అన్నీ కూడా పెద్ద ఊసరవెల్లి వద్దకు చేరుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే శ్రీదేవి లాంటి నమ్మకద్రోహుల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని అన్నారు. కొద్ది రోజుల్లోనే చీకొట్టే స్థితికి చేరుకుంటారని తీవ్ర విమర్శలు చేశారు. రూ.10 కోట్ల రూపాయలు ఇస్తాము ఓటు వేయమని ఓటుకు నోటు ఆఫర్ చేశారని రాపాక వరప్రసాదే చెప్పాక.. కొత్త చర్చలేందుకని ప్రశ్నించారు.
ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. అయితే వైసీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపైన శ్రీదేవి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని మీడియా చానెల్స్, కొందరు వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని శ్రీదేవి తెలిపారు. అమరావతి ప్రాంతంలో ఉన్న తనను రాజకీయంగా వైసీపీ నేతలు టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. డబ్బులు ఇచ్చి తనపై కార్యాలయంపై దాడులు చేయించారన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజు నుంచే తనను వేధిస్తున్నారన్నాని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఎవరికి ఓటు వేశానో వైసీపీ నాయకత్వానికి తెలుసునని చెప్పారు. 22వ ప్యానెల్‌లో జనసేన ఎమ్మెల్యే లేరా?, విశాఖ జిల్లాకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యే లేరా? అని ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుంచే తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
తాను ఒక డాక్టర్ అని.. తన భర్త కూడా డాక్టర్ అని ఆమె చెప్పారు. తమకు రెండు ఆసుపత్రులు కూడా ఉన్నాయన్నారు.తాను డబ్బులు తీసుకొని ఓటు వేయాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు ఏమైనా జరిగితే ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డిదే బాధ్యత అని చెప్పారు.
గత ఎన్నికల సమయంలో రాజధాని ఇక్కడే ఉంటుందని తాను ప్రజలకు వాగ్ధానం చేశాననని తెలిపారు. వైఎస్ జగన్ ఇక్కడే ఇల్లు కట్టుకున్నారని ప్రజలకు చెప్పానన్నారు. తన మాటలను నమ్మి ప్రజలు తనను గెలిపించారని శ్రీదేవి తెలిపారు. ‘‘మన అమరావతి మన రాజధాని’’ అని అన్నారు. ప్రాణం పోయినా సరే రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తానని చెప్పారు. అమరావతి ప్రాంతంలో రైతుల పక్షాన స్వతంత్ర ఎమ్మెల్యేగా పోరాడుతాని తెలిపారు. జగనన్న ఇళ్ళ పథకం అతి పెద్ద స్కామ్ అని ఆరోపించారు. తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని.. దోచుకో.. పంచుకో అనేదే వైసీపీ ప్రభుత్వం సిద్ధాంతం అని విమర్శించారు. తన ఇంట్లో గంజాయి పెట్టి అక్రమ కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను డబ్బులు తీసుకున్నట్టుగా ఆరోపణలు చేసినవారికి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. సీఎం జగన్ కొట్టిన దెబ్బకు తనకు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరాలనే ఆలోచన లేదని చెప్పారు.