జగన్ విశాఖ రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు.. వ్యవస్థలన్నీ ఇక్కడి నుంచే : మంత్రి గుడివాడ అమర్‌నాథ్

Siva Kodati |  
Published : Apr 20, 2023, 04:34 PM IST
జగన్ విశాఖ రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు.. వ్యవస్థలన్నీ ఇక్కడి నుంచే : మంత్రి గుడివాడ అమర్‌నాథ్

సారాంశం

సెప్టెంబర్‌లో సీఎం జగన్ విశాఖ రాకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. జగన్ విశాఖ రారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెప్టెంబర్ నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖలో కాపురం పెడతానని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో విపక్షాలు ఆయనపై మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. జగన్ విశాఖ రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. విశాఖ నుంచే వ్యవస్థలన్నీ పనిచేస్తాయని.. సీఎం పరిపాలనను ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. జగన్ విశాఖ రారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన చేస్తారని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు విశాఖ పరిపాలనా రాజధానికి వ్యతిరేకమా, అనుకూలమా అన్న దానిని చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. 

ఇకపోతే.. సీఎం జగన్ బుధవారం  శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం  జగన్ మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో అతిపెద్ద నగరం, అందరికి ఆమోదయోగ్యమైన విశాఖలోనే తాను సెప్టెంబర్ నుంచి కాపురం పెట్టబోతున్నట్టుగా తెలిపారు. 

Also Read: సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెట్టబోతున్నాను.. సీఎం జగన్ కీలక ప్రకటన

గత పాలకులు శ్రీకాకుళం అభివృద్దిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. శ్రీకాకుళం.. చెన్నై, ముంబై మాదిరిగా అభివృద్ది అయ్యే  అవకాశం ఉన్న గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. ఈ రోజు చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రాన్ని మార్చివేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మూలపేట.. ఇక మూలన ఉన్న ఒక పేట కాదని.. అభివృద్దికి మూల స్తంభంగా  నిలుస్తుందని అన్నారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలు రాబోయే రోజుల్లో, రాబోయే  తరానికి ముంబై, మద్రాసు కానున్నాయని చెప్పారు.  24 నెలల్లో పోర్టు పూర్తవుతుందని.. దీని నిర్మాణానికి రూ. 4,362 కోట్లు ఖర్చు చేయనున్నట్టుగా తెలిపారు. 

‘‘పోర్టు పూర్తైన తర్వాత మన పిల్లలకు ఇక్కడే ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల ఉద్యోగాలు లభిస్తాయి’’ అని జగన్ చెప్పారు. పోర్టు వస్తే.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయని.. లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. పోర్టుతో పాటు  మరో రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నట్టుగా చెప్పారు. గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గంగపుత్రులు వేరే  ప్రాంతాలకు వలస వెళ్లకుండా కృషి చేస్తున్నామని చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage
నేతన్నలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 25వేలు| Asianet News Telugu