మూడు రాజధానుల వ్యవహారం.. రాజీనామాకు అనుమతి కోరిన ధర్మాన, వారించిన సీఎం జగన్

By Siva KodatiFirst Published Oct 21, 2022, 5:17 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మంత్రి ధర్మాన ప్రసాదరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల కోసం తాను రాజీనామా చేస్తానని అనుమతించాలని ఆయన సీఎంను కోరారు. అయితే మంత్రి ధర్మానను ముఖ్యమంత్రి జగన్ వారించినట్లుగా తెలుస్తోంది.

మూడు రాజధానుల అంశంపై అధికార వైసీపీ నుంచి కీలక సంకేతాలు వెలువడుతున్నాయి. శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మంత్రి ధర్మాన ప్రసాదరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజీనామా ప్రతిపాదనను జగన్‌తో ప్రస్తావించారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖ సాధనా ఉద్యమం కోసం రాజీనామా చేస్తానని ధర్మాన తెలిపారు. ఉద్యమం చురుగ్గా చైతన్యవంతంగా సాగేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కంటే మంత్రి పదవి గొప్పది కాదని ధర్మాన అన్నారు. తన రాజీనామాను అనుమతించాలని సీఎం జగన్‌ కోరారు. అయితే మంత్రి ధర్మానను ముఖ్యమంత్రి వారించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ధ్యేయమని ధర్మానకు మరోసారి స్పష్టం చేశారు జగన్. అభివృద్దిని అన్ని ప్రాంతాలకు పంచుతూ , వికేంద్రీకరణ , సమగ్ర అభివృద్ధే తమ విధానమని జగన్ చెప్పారు. మూడు ప్రాంతాలకు సమ న్యాయమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి తెలిపారు. 
 

click me!