
కోవిడ్ తో రెండేళ్ల పాటు ఇబ్బందులు పడ్డామన్నారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy). శుక్రవారం గుంటూరులో జరుగుతోన్న వైసీపీ ప్లీనరీలో (ysrcp plenary) ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలోనూ నవరత్నాలు ఆపలేదని గుర్తుచేశారు. గ్రామ పంచాయతీ నిధులపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని బుగ్గన మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఎగుమతుల్లో ఏడవ స్థానంలో వున్న ఏపీ.. జగన్ పాలనలో మూడవ స్థానానికి చేరుకుందని ఆర్ధిక మంత్రి తెలిపారు. టీడీపీ ఆపేసిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం చేశామని బుగ్గన గుర్తుచేశారు.
కాపుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రూ.3,100 కోట్లయితే .. ఖర్చు పెట్టింది కేవలం రూ.2000 కోట్లని ఆయన తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్ ఎన్నోసార్లు ప్రధాని మోడీతో మాట్లాడారని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. కోవిడ్ సమయంలోనూ, ప్రస్తుతం గ్రామ వాలంటీర్లు ఎంతో శ్రమించారని మంత్రి అన్నారు. జన్మభూమి కమిటీకి వాలంటీర్ వ్యవస్థకు ఎంతో తేడా వుందని బుగ్గన తెలిపారు. జన్మభూమి కమిటీలు కావాల్సిన వాళ్లకి మాత్రమే పనులు చేశాయని.. కానీ గ్రామ వాలంటీర్లు అర్హత వున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
ALso Read:కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు.. ప్లీనరీలో విద్యారంగంపై తీర్మానం ప్రవేశపెట్టిన బొత్స
చంద్రబాబు మాటలను ఇంకా టీడీపీ కార్యకర్తలు నమ్ముతున్నారా అంటూ బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వనము- మనము, నీరు - చెట్టు కార్యక్రమాలన్నీ దోపిడి కోసమే ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. నేను వుంటే కరోనా రానిచ్చేవాడినా అని అంటున్నారని.. చంద్రబాబు మాటలు విని నవ్వుకుంటున్నారంటూ రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు.
అంతకుమందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నవరత్నాలు, గ్రామ సచివాలను స్టడీ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని తెలిపారు. పేదలందరికీ వైద్యం అందించే దిశగా జగన్ కృషి చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఒకేసారి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అమ్మఒడి లబ్ధిదారులకు మూడేళ్లలో రూ.19,600 కోట్లకు పైగా నగదు బదిలీ చేశామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 61 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బుగ్గన పేర్కొన్నారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు అందజేశామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుచేశారు.