
వైసీపీ ప్లీనరీలో (ysrcp plenary) విద్యా రంగంపై తీర్మానం చేశారు నేతలు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారని బొత్స చెప్పారు. చంద్రబాబు లాంటి అవగాహన లేని నాయకులు పాఠశాల విద్యపై మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తున్నారని సీఎంపై బొత్స ప్రశంసల వర్షం కురిపించారు. ఒకటో తరగతి నుంచి 5 తరగతి వరకు ఒకే టీచర్ బోధిస్తున్న విధానాన్ని మార్చి.. సబ్జెక్ట్ కో టీచర్ ను నియమించామని మంత్రి వెల్లడించారు.
అంతకుముందు .. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై మీడియాలో వస్తున్న కథనాలపై గురువారం బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) స్పందించారు. రాష్ట్రంలో ఒక్క బడి కూడా మూతపడలేదని స్పష్టం చేశారు. ఏపీ విద్యా రంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానానికి అనుగుణంగా ఇవి జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రతీ ఒక్కరికి విద్యను అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... ఇందుకోసం సీఎం జగన్ తీవ్రంగా (ys jagan) శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని బొత్స వ్యాఖ్యానించారు.
ALso REad:మేం స్కూల్స్ మూశామా.. ఒక్కటి చూపించండి : టీడీపీకి మంత్రి బొత్స సవాల్
పిల్లలను బడి బాట పట్టించడానికే తాము అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టామని.. రాష్ట్రంలోని 42,750 స్కూల్స్‌కి గాను 5,280 స్కూల్స్‌ని మ్యాపింగ్ చేశామన్నారు. సెంట్రల్ స్కూల్స్ విధానం కింద ప్రతి సబ్జెక్ట్‌కి టీచర్ ను నియమించామని ఆయన పేర్కొన్నారు. బైజూస్‌తో ఒప్పందం వల్ల 40 లక్షల మంది పిలలకు ప్రయోజనం కలుగుతోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజకీయాల కోసం లేని దానిని ఉన్నట్లుగా చూపించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాల విద్యార్ధులతో ఏపీ విద్యార్ధులు పోటీపడే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. దమ్ముంటే తాము మూసేశామని చెబుతున్న ఒక్క స్కూల్‌ని చూపాలని ఆయన సవాల్ విసిరారు.