
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు చేస్తోన్న మహా పాదయాత్రపై అధికార వైసీపీకి చెందిన మంత్రులు, నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే రైతులు ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రి బొత్స సత్యనారాయణ సైతం శనివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల పాదయాత్ర ఒక్క అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దుష్టశక్తులు, దుర్మార్గులను అడ్డుకోవాల్సిన అవసరం వుందని బొత్స పేర్కొన్నారు.
బీజేపీ నేతలు రాజధాని విశాఖకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బీజేపీ నేతలు ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని... వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని బొత్స స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో వికేంద్రీకరణకు సంబంధించిన అంశాలను పెట్టామని.. బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 29 గ్రామాలు, ఒక ప్రాంతం, వర్గం కోసం ప్రభుత్వం ఆలోచించదని మంత్రి పేర్కొన్నారు. శివరామకృష్ణన్ కమిటీకి గత ప్రభుత్వం కో ఆపరేట్ చేయలేదని..ఆ కమిటీ గత ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదని చెప్పిందని బొత్స గుర్తుచేశారు. రైతుల ముసుగులో టీడీపీ చేస్తున్న పాదయాత్రకు బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.