ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడికి ఎక్కడ దూరం అవ్వాల్సి వస్తుందోనని మనస్థాపానికి గురయి ఇంటర్మీడియట్ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది.
చిత్తూరు : చిన్నప్పుడే తల్లిప్రేమను కోల్పోయిన యువతి మరోసారి ప్రాణంగా ప్రేమించినవాడికి ఎక్కడ దూరమవవ్వాల్సి వస్తుందోనన్న ఆందోళనతో దారుణ నిర్ణయం తీసుకుంది. పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయిన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన మునిరాజ కూతురు మోహనకృష్ణ (19) చిన్నపుడే తల్లిని కోల్పోయింది. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో ఆ తండ్రి కూతురిని అమ్మమ్మవారింట్లో వుంచి చదివిస్తున్నాడు. ఎగువరెడ్డివారిపల్లిలో వుంటున్న యువతి ప్రస్తుతం డిస్టెన్స్ లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
అయితే మోహనకృష్ణ గతకొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నా పెళ్ళికి పెద్దలు అంగీకరించరని భావించారు. కాబట్టి పెద్దలను ఎదిరించి ఎక్కడికయినా వెళ్లిపోయి పెళ్లిచేసుకోవాలని భావించారు. ఇలాగే వారంరోజుల క్రితం ప్రేమికులు పారిపోయారు.
యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ప్రేమజంట ఆఛూకి కనుక్కుని ఇరు కుటుంబాల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరినీ వారివారి కుటుంబసభ్యులతో పంపించారు. దీంతో ఇక ప్రియుడిని కలిసే అవకాశం వుండదని... అతడిని తనకు పూర్తిగా దూరం చేసేస్తారని మోహనకృష్ణ మనస్తాపానికి గురయ్యింది. దీంతో దారుణ నిర్ణయం తీసుకుంది.
ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో సీలింగ్ ప్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు ఇది గమనించేసరికి మోహనకృష్ణ ప్రాణాలు కోల్పోయింది. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు సమాచారమివ్వగా యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి హాస్పిటల్ కు తరలించారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)