రాబోవు రోజుల్లోనూ కరోనా కట్టడి కష్టమే...వారి ప్రాణాలే ఫస్ట్ ప్రయారిటీ: మంత్రి అవంతి

By Arun Kumar PFirst Published Jul 27, 2020, 6:54 PM IST
Highlights

ప్రతి పౌరునికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

విశాఖపట్నం: ప్రతి పౌరునికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందు వలన ఆసుపత్రుల్లో పడకల సంఖ్య మరిన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోవిడ్-19 తో సీరియస్ గా ఉన్న వారి ప్రాణాలను ముందుగా కాపాడడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని ఆయన వైద్యులను కోరారు.  

కోవిడ్-19పై విఎంఆర్డిఎ చిల్ట్రన్స్ ఎరీనాలో ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా మరణాల రేటును తగ్గించేందుకు డాక్టర్లు కృషిచేయాలని పేర్కొన్నారు.  వైద్య సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాజిటివ్ కేసులు తరలించేందుకు ఏ విధమైన సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఆంబులెన్స్ లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.  

జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ... జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్షా 32 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు 7390 పాజిటివ్ కేసులు వచ్చాయని చెప్పారు.   చిన్న చిన్న లక్షణాలు ఉన్న వారికి, ఏ లక్షణాలు కనిపించకుండా పాజిటివ్ ఉన్నవారిని హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నట్లు ఆయన వివరించారు.  కోవిడ్-19 తీవ్రంగా ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.  22 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్-19 సేవలకు ఏర్పాటు చేయడమైనదని, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు 8, ప్రైవేట్ ఆసుపత్రులు 14 ఉన్నాయని, ఈ ఆసుపత్రుల్లో 7 వేల పడకలు సిద్దం చేయనున్నట్లు వెల్లడించారు.  

read more  ఏపీలో కొనసాగుతున్న కరోనా జోరు: 1,02,349కి చేరిన కేసులు

ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది కొరతగా ఉందని... ఈ కొరతను తీర్చడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నుండి వైద్యులతో ఇప్పటికే మాట్లాడడమైనదని, వారు విధులలో చేరేందుకు సుమఖం వ్యక్తం చేసినట్లు చెప్పారు. కోవిడ్ లక్షణాలు లేకుండా పరీక్షలు చేయించుకోవద్దని... అలా చేయించుకోవాలనుకొనే వారు ప్రైవేట్ ల్యాబ్స్ లో చేయించుకోవాలని, అందులో పరీక్షకు రూ.750/-ఖర్చు అవుతుందని చెప్పారు. 

జివియంసి పరిధిలోని వార్డుల్లో ప్రత్యేక అధికారులు, వైద్యులను నియమించడమైనదని... జివియంసి (వార్డుల్లో) పరిధిలో ఆంబులెన్స్ లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.  గ్రామీణ ప్రాంతంలో ఆంబులెన్స్ లు, 104 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. డిజిటల్ ఎక్స్ రే లు వస్తున్నాయని చెప్పారు.  

అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బి.వి. సత్యవతి మాట్లాడుతూ... పరీక్షలు చేసే కెపాసిటి పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, జివియంసి కమీషనర్ జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, విఎంఆర్డిఎ అదనపు కమీషనర్ మునజీర్ జిలానీ సమూన్, డి.సి.పి. ఐశ్వర్య రస్తోగి, జిల్లా జాయింట్ కలెక్ట్-3 గోవిందరావు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు. 
 

click me!