
గోదావరి వరద బాధితులను (godavari floods) పరామర్శించేందుకు చంద్రబాబు (chandrababu naidu) టీడీపీ (tdp) జెండాలతో వెళ్తారా అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu). వరద బాధితులతో మాట్లాడేందుకు వెళ్లారా లేక ఎన్నికల ప్రచారానికి వెళ్లారా అని అంబటి మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. నదుల్లో నీళ్లు ఫుల్‌గా వున్నాయని.. అన్ని ప్రాజెక్ట్‌లు నిండుతాయని అంబటి పేర్కొన్నారు. వరదలు ఈ ఏడాది చాలా ముందుగా వచ్చాయని రాంబాబు దుయ్యబట్టారు.
అంతకుముందు శ్రీశైలం ప్రాజెక్టు ( srisailam project) గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు మంత్రి అంబటి రాంబాబు. గత కొద్ది రోజులుగా ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం ప్రాజక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈరోజు ఉదయం మంత్రి.. మూడు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రాజెక్టు వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు.
Also REad:శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రి అంబటి
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో అక్కడి నుంచి కృష్ణమ్మ దిగువకు పరవళ్లు తొక్కుతుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఓ వైపు ప్రాజెక్టు అందాలను వీక్షించడంతో పాటుగా.. మరోవైపు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకునేందుకు పర్యాటకులు, భక్తులు శ్రీశైలంకు వస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం 12 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉన్నాయి. అందులో ప్రస్తుతం మూడింటిని మాత్రమే ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం డ్యామ్‌లోని పూర్తిస్థాయి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.50 అడుగులకు చేరుకుంది.ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 202.04 టీఎంసీలు నీటి నిల్వ ఉంది.ఇన్‌ఫ్లో 1.27 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 80 వేల క్యూసెక్కులు ఉంది.కుడి, ఎడమ గట్ల విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో.. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మరింతగా పెరగనుంది.