దుమారం రేపుతున్న ‘ఆది’ వ్యాఖ్యలు

First Published Aug 16, 2017, 7:35 AM IST
Highlights
  • ఎస్సీ, ఎస్టీలపై మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయ్.
  • మంత్రి వ్యాఖ్యలు నంద్యాల ఉపఎన్నికలో ఎటువంటి ప్రభావం చూపుతాయో అని టిడిపి నేతల్లో ఆందోళన మొదలైంది.
  • తమపై అనుచిత వ్యాఖ్యలు చేయటంపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు మండిపడుతున్నాయి.
  • తమకు మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్నట్లు తయారవుతోంది టిడిపి నేతల పరిస్ధితి. ఎస్సీ, ఎస్టీలపై మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయ్. మంత్రి వ్యాఖ్యలు నంద్యాల ఉపఎన్నికలో ఎటువంటి ప్రభావం చూపుతాయో అని టిడిపి నేతల్లో ఆందోళన మొదలైంది.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున కడప జిల్లా జమ్మలమడుగు ఆసుపత్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలకు శుభ్రత తెలీదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు ఎన్ని అవకాశాలు కల్పించినా చదువుకోవటం లేదన్నారు. చదువుకోకపోయినా సూపరెండెంట్ వరకూ పదోన్నతుల్లో వచ్చేస్తున్నట్లు మండిపడ్డారు.  

70 ఏళ్ళయినా ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధిలోకి రాకపోవటానికి కారణం ఎస్సీ, ఎస్టీలేనన్నారు. కేవలం పదేళ్ళు వరకే ఉన్న రిజర్వేషన్లను దశాబ్దాల పాటు పొడిగించినా ఉపయోగం కనబడటం లేదని తెలిపారు. పైగా నంద్యాల ఉపఎన్నిక పూర్తవ్వగానే తన కుమారుడు ఈ ఆసుపత్రి ఛైర్మన్ గా తన కొడుకు సుధార్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటాడని చెప్పటం గమనార్హం.

ఎస్సీ, ఎస్టీలపై  మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్రంలో కలకలం రేపాయి. తమపై అనుచిత వ్యాఖ్యలు చేయటంపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు మండిపడుతున్నాయి. తమకు మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలను అవమానించిన మంత్రి ఆదినారాయణరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలంటూ పలు సంఘాలు చంద్రబాబునాయుడును డిమాండ్ చేస్తున్నాయి.

అయితే, ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వం వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు. సాక్ష్యాత్తు చంద్రబాబునాయుడే గతంలో పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ‘ఎక్కడ పుట్టాలో కోరుకునే అవకాశం ఉంటే ఎవరు మాత్రం ఎస్సీ, ఎస్టీల్లో పుట్టాలని కోరుకుంటారు’ అంటూ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

అదేవిధంగా, ‘ఎస్టీలు అడవుల్లో వుంటారని, శుభ్రంగా ఉండరని, వారికి తెలివి ఉండదని’ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా మంత్రి వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారింది. అదికూడా నంద్యాల ఉపఎన్నిక సమయంలో మంత్రి ఎస్సీ, ఎస్టీలనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

 

click me!