సొంత ఇలాకాలో ఇదా పరిస్థితి... ప్రజలకు ఏం చెప్పుకోవాలి..: అధికారులపై మంత్రి ఆగ్రహం (వీడియో)

By Arun Kumar PFirst Published Jun 1, 2021, 4:26 PM IST
Highlights

ఆత్మకూరు అభివృద్ధి పనుల్లో ఎదురయ్యే సవాళ్లు, ఇబ్బందుల కన్నా అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువుందంటూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆగ్రహించారు. 

నెల్లూరు: తన సొంత నియోజకవర్గం ఆత్మకూరు అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని డీఈ, ఏఈలను  మంత్రి నిలదీశారు. ఎదురయ్యే సవాళ్లు, ఇబ్బందుల కన్నా అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువుందని మంత్రి ఆగ్రహించారు. 

 ఆత్మకూరు అభివృద్ధిపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీర్లతో మంత్రి మేకపాటి సమీక్ష నిర్వహించారు. విజయవాడ ప్రధాన కార్యాలయం ఈఎన్ సీ సుబ్బారెడ్డికి ఫోన్ లో పనుల పురోగతి గురించి వివరించారు. రూ.120 కోట్ల విలువైన ఇంజనీరింగ్ పనులలో మందగమనంపై మంత్రి మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వీడియో

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో స్వయంగా మాట్లాడి ఆత్మకూరు ప్రజలకు మంచి చేయాలని ప్రత్యేకంగా మంజూరు చేయించుకున్న రూ.20 కోట్ల పనుల గురించి మంత్రి ప్రస్తావించారు. గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ చికిత్స కేంద్రాలు,  బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల అభివృద్ధిలో పురోగతి లేకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను అలక్ష్యం చేసినవారి స్థానంలో వేరేవారిని తీసుకువచ్చేందుకు సంశయించనని మంత్రి హెచ్చరించారు. 

read more  యువ సీఎం నాయకత్వంలో అద్భుతాలు...: విజయసాయి రెడ్డి

ఆత్మకూరులో నిర్లక్ష్యంగా సాగుతున్న పనులపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దృష్టికి తీసుకువెళతానన్న మంత్రి మేకపాటి తెలిపారు.  అనంతసాగరం, ఆత్మకూరు, మర్రిపాడు, చేజెర్ల, ఏ.ఎస్ పేట మండలాల్లో ఇంకా పనులే మొదలు కాకపోవడం... పునాది రాయి కూడా పడకపోవడం బాధాకరమన్నారు మంత్రి. కేటాయించిన లక్ష్యాలను యుద్ధప్రాతిపదికన అధిగమించాలని మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. 

నిజంగానే స్టీల్, సిమెంట్ కొరత వస్తే డీలర్లతో, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిష్కారిస్తామని మంత్రి మేకపాటి భరోసా ఇచ్చారు. కానీ అధికారుల అలసత్వం వల్ల పనులు ఆగిపోయినా, నత్తనడకన సాగినా ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. 

click me!