తుఫాను ప్రభావిత జిల్లాలపై మంత్రి మేకపాటి సమీక్ష.. తక్షణ చర్యలకు ఆదేశాలు..

By AN TeluguFirst Published Nov 27, 2020, 5:27 PM IST
Highlights

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, ప్రజలపై వరద ప్రభావంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాలోని ఏఏ మండలాలలో నివర్ ప్రభావం తీవ్రంగా ఉందో ఆరా తీశారు. వాటిపై తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు గ్రామాలు, నీట మునిగిన ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ప్రజలకు కలిగిన నష్టం, పునరావాస ఏర్పాట్ల విషయం గురించి వాకబు చేసి తదనుగుణంగా ఆదేశాలిచ్చారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబుతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి మేకపాటి జిల్లా సహా, ఆత్మకూరు నియోజకవర్గంలోని సత్వర చర్యలపై పలు ఆదేశాలిచ్చారు.  

అనంతసాగరం మండలంలోని కచ్చిరి దేవరాయపల్లి, వెంగమనాయుడుపల్లి గ్రామాలు నీట మునిగాయని ఆ గ్రామాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి మేకపాటి ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గ్రామాలలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ముందుగానే అంచనా వేసి లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. 

వర్షం, వరదలను ఖాతరు చేయకుండా ప్రజా రక్షణకు కృషి చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి పెన్నా, సోమశిల ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నేపథ్యంలో జిల్లాతో, నీట మునిగిన గ్రామాల పరిస్థితిపై స్థానిక నేతల ద్వారా ఎప్పటికప్పుడు మంత్రి వాకబు చేస్తున్నారు.  

అధికార యంత్రాంగంతో పాటు, మండలాలలోని కన్వీనర్లకు సహాయక చర్యలు చేపట్టేలా అప్రమత్తం చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఫోన్ లో వివరాలు తెలుసుకుని సత్వర చర్యలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక యువత, పార్టీ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో భాగస్వామ్యం అవ్వాలని మంత్రి గౌతమ్ రెడ్డి పిలుపునిచ్చారు. 

click me!