Mekapati Gautham Reddy: ఆశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి

By narsimha lodeFirst Published Feb 23, 2022, 12:07 PM IST
Highlights

ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం నాడు అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. 

నెల్లూరు: ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి Mekapati Gautham Reddy  అంత్యక్రియలు బుధవారం నాడు జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో last rites ను నిర్వహించారు. సోమవారం నాడు గుండెపోటుతో మంత్రి గౌతం రెడ్డి మరణించారు.  ఇవాళ ఉదయం నెల్లూరు నుండి ఉదయగిరి వరకు  మేకపాటి గౌతం రెడ్డి పార్ధీవ దేహన్ని ర్యాలీగా తీసుకొచ్చారు. 

తాడేపల్లి నుండి ఏపీ సీఎం YS Jaganబుధవారం నాడు ఉదయం ఉదయగిరికి చేరుకొన్నారు.  గౌతం రెడ్డి పార్ధీవ దేహం వద్ద సతీమణి భారతితో కలిసి జగన్ నివాళులర్పించారు. సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు. ఉదయగిరిలోని మెరిట్ కాలేజీ ఆవరణలో గౌతం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించారు. 

తండ్రి  మరణించిన విషయం తెలిసిన వెంటనే అమెరికాలో ఉన్న ఆయన కుమారుడు కృష్ణార్జున రెడ్డి ఇండియాకు వచ్చారు..  అమెరికా నుంచి నేరుగా ఆయన చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. మంగళవారం రాత్రి 11 గంటల దాటిన తర్వాత కృష్ణార్జున రెడ్డి నెల్లూరులోని నివాసానికి చేరుకున్నారు..

స్వగృహంలో ఉంచిన గౌతం రెడ్డి పార్ధీవ దేహన్ని చూసి కృష్ణార్జున రెడ్డి బోరున విలపించారు. గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర బుధవారం ఉదయం డైకస్ రోడ్డులోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైంది. అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.  జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరు పాలెం, మర్రిపాడు, సరిహద్దు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరిలోనే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ర్యాలీగా సాగింది. గౌతమ్ రెడ్డి అంతిమ యాత్రలో భారీగా ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి వీరి సొంత గ్రామం, ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. మేకపాటి వయస్సు 49 సంవత్సరాలు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994-1997లో మాంచెస్టర్ యూనివర్శిటీలో సైన్స్ టెక్నాలజీ  నుండి M.Sc పట్టాను పొందారు. 

గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.  ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతం రెడ్డి పనిచేస్తున్నారు. సోమవారం నాడు  ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించిడంతో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆయన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్  తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాధికుడ్ని కోల్పోయానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ సీఎం గుర్తుచేసుకున్నారు. 

click me!