
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను (srivari darshanam tickets) టీటీడీ ఈరోజు ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి 28 వరకు అదనంగా రోజుకు 13 వేల చొప్పున రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచింది. అలాగే మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. సాంకేతిక సమస్యతో భక్తులు టికెట్ల బుకింగ్ చేసుకోలేకపోతున్నారు. ఫిబ్రవరి, మార్చికు సంబంధి 8 లక్షల 40 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది.
పేమెంట్ గేట్‌వే వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో టిక్కెట్లు కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన అనంతరం టికెట్ల కేటాయింపు ప్రక్రియ తిరిగి ప్రారంభించనున్నట్టుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 61 వేల టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకున్నట్టుగా సమాచారం.
గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి తగ్గడంతో టీటీడీ మరింత మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే మార్చి నెలలో దాదాపు 14 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) కల్పించేందుకు టికెట్లు జారీచేయనుంది. మార్చిలో రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్ పద్ధతిలో కేటాయించనుంది.
ఇక, ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు ఐదువేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లోని కౌంటర్ల వద్ద ఇవ్వనుంది.