Andhra News: మేకపాటి కుటుంబం కీలక నిర్ణయం.. గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా విక్రమ్ రెడ్డి

By Sumanth Kanukula  |  First Published Apr 10, 2022, 11:34 AM IST

దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆత్మ‌కూరు అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే వైసీపీ అభ్యర్థి‌ ఎవరనే దానిపై రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంలో తాజాగా మేకపాటి కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.


దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆత్మ‌కూరు అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే వైసీపీ అభ్యర్థి‌ ఎవరనే దానిపై రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్య శ్రీ కీర్తి బరిలో దిగుతారని.. ఆమెను వైసీపీ అభ్యర్థిగా నిలపడానికి సీఎం జగన్ కూడా సుముఖంగా ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఉప ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నిక కాకముందే శ్రీ కీర్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా ఊహాగానాలు వచ్చాయి.

అయితే ఆత్మకూరు నుంచి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు, దివంగత గౌతమ్ రెడ్డి తమ్ముడు విక్రమ్ రెడ్డిని బరిలో నిలపాలని మేకపాటి కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి పేరును సూచిస్తూ మేకపాటి కుటుంబం సీఎంవో కార్యాలయానికి అభిప్రాయానికి తెలియజేసింది. విక్రమ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు కుటుంబ సభ్యులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. అనంతరం ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా అంతా భావిస్తున్నారు.

Latest Videos

undefined

ఇక, విక్రమ్ రెడ్డి విషయానికి వస్తే.. ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఐఐటీ చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అమెరికాలో కన్‌స్ట్రక్షన్  మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత.. వారి కుటుంబ సంస్థ కేఎంసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇక, గౌతమ్ రెడ్డిలాగే విక్రమ్ రెడ్డికి కూడా మృదువుగా మాట్లాడతారనే పేరు ఉంది. ఇక, ఇప్పుడు అన్న గౌతమ్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు విక్రమ్ రెడ్డి సిద్దమయ్యారు. 

click me!