విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని గోడపై రాశా: ఉద్యమానికి చిరంజీవి మద్ధతు

By Siva KodatiFirst Published Mar 10, 2021, 8:36 PM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఉద్యమానికి ప్రముఖుల మద్ధతు పెరుగుతోంది. తాజాగా సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కార్మికులకు జై కొట్టారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఉద్యమానికి ప్రముఖుల మద్ధతు పెరుగుతోంది. తాజాగా సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కార్మికులకు జై కొట్టారు.

ఈ సందర్భంగా నాడు విశాఖ ఉక్కు కార్మాగారం సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న రోజులను చిరంజీవి గుర్తుచేసుకున్నారు. కాలేజీ చదివే రోజుల్లోనే విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని మెగాస్టార్ తెలిపారు.

నష్టాల సాకుతో ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తామనడం దుర్మార్గమని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాలు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read:విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు: కేటీఆర్

అంతకుముందు విశాఖ ఉక్కు ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. అవసరమైతే విశాఖపట్టణానికి వెళ్లి ఈ ఉద్యమంలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు.

ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మౌనంగా వుంటే.. రేపు బీహెచ్‌ఈఎల్, సింగరేణిని కూడా అమ్మేస్తారంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విమర్శించారు.

ప్రతీదానిని ప్రైవేటీకరణ చేస్తామనే విధానం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా లేదా అనేది కేస్ బై కేస్ చూడాలని స్వామి సూచించారు.

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానిని కలిసేటప్పుడు జగన్‌తో పాటు తాను కూడా వెళ్తానని సుబ్రమణ్యస్వామి వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడంపై తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.

click me!