రఘురామను ఎవరూ కొట్టలేదు: వైద్యుల నివేదికలో సంచలన విషయాలు

By Siva KodatiFirst Published May 16, 2021, 7:27 PM IST
Highlights

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎవరూ కొట్టలేదని వైద్య నిపుణుల బృందం హైకోర్టుకు అందజేసిన నివేదికలో తెలిపింది. రఘురామ పూర్తి ఆరోగ్యంగా వున్నట్లు వైద్య బృందం పేర్కొంది. దీనిని న్యాయమూర్తులు హైకోర్టులో చదివి వినిపించారు. రఘురామకు అన్ని పరీక్షలు చేసినట్లు వైద్య బృందం కోర్టుకు తెలిపింది. 

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎవరూ కొట్టలేదని వైద్య నిపుణుల బృందం హైకోర్టుకు అందజేసిన నివేదికలో తెలిపింది. రఘురామ పూర్తి ఆరోగ్యంగా వున్నట్లు వైద్య బృందం పేర్కొంది. దీనిని న్యాయమూర్తులు హైకోర్టులో చదివి వినిపించారు.

రఘురామకు అన్ని పరీక్షలు చేసినట్లు వైద్య బృందం కోర్టుకు తెలిపింది. రఘురామ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వైద్య బృందం నివేదికలో వెల్లడించింది. దీంతో సీఐడీ కోర్ట్ ఆదేశాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఇదే సమయంలో రమేశ్ ఆసుపత్రికి రఘురామను తరలించడంపై ఏఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేశ్ ఆసుపత్రికి పంపడమంటే టీడీపీ ఆఫీస్‌కు పంపినట్లేనని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో 10 మంది కోవిడ్ రోగులు మరణించారని ఆయన గుర్తుచేశారు.

రమేశ్ ఆసుపత్రిపై క్రిమినల్ కేసులు వున్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలగజేసుకున్న కోర్టు.. పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో సీఐడీ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

హైకోర్టులో వాదనల సందర్భంగా రఘురామ తరపు న్యాయవాదులు.. కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో వైద్య పరీక్షలు చేసి జైలుకు తరలించారని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రఘురామను ఎందుకు జైలుకు తరలించారని ప్రశ్నించింది.

Also Read:జగన్ బెదిరించారు, నా భర్తను జైల్లో చంపేస్తారు: రఘురామ భార్య రమాదేవి

అయితే మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారమే జైలుకు తరలించామని ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. అయితే ప్రభుత్వాసుపత్రిలో పరీక్షల తర్వాత ఎంపీని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారా అని హైకోర్టు.. పోలీసులను ప్రశ్నించింది.

హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టి సీఐడీ కోర్టు ఆదేశాలను ఎలా అమలు చేశారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఆసుపత్రిలో వున్న ఎంపీ దగ్గరకు సీఐడీ చీఫ్‌ను అనుమతించడంపై రఘురామ లాయర్ల అభ్యంతరం తెలిపారు. అసలు సీఐడీ చీఫ్ ఎందుకెళ్లారు, మెడికల్ బోర్డు ఎలా అనుమతించిందని హైకోర్టు ప్రశ్నించింది.

మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం సీఐడీ కోర్ట్ ఆదేశాలు రీకాల్ చేయాలని రఘురామ తరపు న్యాయవాదులు కోరారు. మేం ఆదేశాలిచ్చాక, సీఐడీ  కోర్ట్ ఆర్డర్ ఇచ్చిందా, ముందు ఇచ్చిందా అని హైకోర్టు ప్రశ్నించింది. సీఐడీ కోర్టే ముందు ఆదేశాలు ఇచ్చిందని రఘురామ తరపున న్యాయవాదులు తెలిపారు. 

click me!