చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటి : జగన్ తో భేటీ తర్వాత మేడా

By Nagaraju TFirst Published Jan 22, 2019, 5:25 PM IST
Highlights

జగన్ ను కలవడం సొంతింటికి వచ్చినట్లు ఉంది. ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి జగన్  అని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్యం విలువలు తెలియని చంద్రబాబు నాయుడు దగ్గర ఉండలేమని అందువల్లే తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు. 

హైదరాబాద్: నారా చంద్రబాబు నాయుడు గారి గంజాయి వనం అయిన తెలుగుదేశం పార్టీ నుంచి తులసి వనం అయిన వైసీపీలోకి వచ్చినట్లు ఉందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. 

లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తాను వైఎస్ జగన్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 31న వైఎస్ జగన్ సమక్షంలో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. 

రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగానే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ప్రజలకు మంచి చెయ్యాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అలా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందానని ఆ నాటి నుంచి ఇప్పటి వరకు నరకయాతన అనుభవించానని తెలిపారు. 

ప్రజలు తనను గెలిపించారని వారికి మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ప్రజల కోసం నాలుగున్నరేళ్ల ఆ పార్టీలో నరకం అనుభవించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఆ పార్టీలో ఉండటం ఇష్టం లేక పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. నాలుగున్నరేళ్లలో రూ.800కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పుకొచ్చారు. 

దోపిడీకి కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు నుంచి విముక్తి పొందేందుకే తాను జగన్ ను కలవడం జరిగిందన్నారు. జగన్ ను కలవడం సొంతింటికి వచ్చినట్లు ఉందని అభిప్రాయపడ్డారు. తాను ఒక్కటే చెప్తున్నానని బాబు నిన్ను నమ్మం బాబూ అంటూ చెప్పుకొచ్చారు. 

ఇంకా చంద్రబాబును నమ్మితే తాను అధో పాతాళానికి వెళ్లిపోవాల్సిందేనని అందువల్లే మేల్కొని వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. జగన్ వయసులో చిన్నవాడైనా ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి అని కొనియాడారు. 

ప్రజాస్వామ్యం విలువలు తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన దగ్గర ఉండలేక జగన్ ను కలిసి పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కల్లబొల్లి మాటలేనని చెప్పేవి ఒక్కటి చేసేది ఒకటన్నారు.  

click me!