ఏపీలో సంచలనంగా మారిన లవ్‌ లైఫ్‌ మోసం.. రీచార్జిల పేరుతో రూ. 200 కోట్ల లూటీ.. ఇంతకీ అనసూయ ఎవరు..?

By Sumanth KanukulaFirst Published Dec 27, 2021, 11:28 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) లవ్ లైఫ్ (Love Life) సైబర్ మోసం ప్రకంపనలు సృష్టిస్తుంది. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో బాధితులు పెద్ద ఎత్తున పోలీస్‌ స్టేషన్‌ల ఎదుట క్యూ కట్టారు. మొత్తంగా రూ. 200 కోట్లకు పైగా లూటీ జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) లవ్ లైఫ్ (Love Life) సైబర్ మోసం ప్రకంపనలు సృష్టిస్తుంది. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో బాధితులు పెద్ద ఎత్తున పోలీస్‌ స్టేషన్‌ల ఎదుట క్యూ కట్టారు. దాదాపు 5 లక్షల మంది బాధితులు లవ్ లైఫ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా రూ. 200 కోట్లకు పైగా లూటీ జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నేచర్‌ అండ్‌ హెల్త్‌ (Nature and Health) అనే ట్యాగ్ లైన్‌తో ఈ యాప్‌ను ప్రారంభించిన  నిర్వహకులు.. పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డారు. కోవిడ్ సమయంలో రోగులకు అవసరమైన వైద్య పరికరాల కోసం రీచార్జిలు చేయించేవారు. వాటిపై పెట్టుబడి పెడితే.. అద్దె చెల్లిస్తామని చెప్పడంతో బాధితులు లక్షలు పెట్టి మెడికల్ డివైజ్‌లను రీచార్జ్ చేశారు. రోజుకు వాటికి అద్దె చెల్లింపులకు జరగడంతో ఒకరిని చూసి మరోకరు మెడికల్ డివైజ్‌లను కొన్నారు. ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుని తాజాగా బోర్డు తిప్పేసారు. 

అయితే ఇలా మెడికల్ డివైజ్‌కు సంబంధించి రీచార్జ్‌లు చేసేవారితో  టెలీ గ్రామ్ గ్రూప్‌లను నిర్వహించేవారు. వీరితో టైలింజిన్‌ అనసూయ పేరుతో అడ్మిన్‌ సంప్రదింపులు జరిపేవారు. మరోవైపు గ్రూప్‌లో ఉన్నవారికి లింక్ ద్వారా కొత్తవారిని చెర్పిస్తే మంచి లాభాలు పొందవచ్చని మెసేజ్‌లు వచ్చాయి. ఇప్పటికే తమకు ఆదాయం వస్తుండటంతో.. జనాలు ఆ విషయాన్ని ఈజీగా నమ్మేశారు. ఇలా కొందరికి లింక్‌లు పంపి జనాలను చేర్పించారు. ఇలా వేలాది మంది ఆదాయం వస్తుందనే ఆశతో మెడికల్ డివైజ్‌లకు రీచార్జ్ చేశారు. గ్రూప్‌లలో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన వారిని ఆయా గ్రూప్‌ అడ్మిన్‌లుగా ఎంపిక చేసి వారి ద్వారా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేశారు. ఒకటి రెండు దఫాలుగా ఆదాయం బాగా వచ్చేసరికి భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా బాధితులు చెబుతున్నారు.  

క్రిస్మస్ ఆఫర్ పేరుతో..
ఇలా జనాలను నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. క్రిస్మస్ రివార్డులను ప్రకటించినట్టుగా బాధితులు తెలిపారు. సభ్యులను చెర్పిస్తే భారీగా రివార్డులు గెలుచుకోవచ్చని అడ్మిన్‌గా ఉన్న అనసూయ పేరుతో పోస్టులు వచ్చాయని చెప్పారు. ఈ క్రమంలోనే జనవరి 1న ఢిల్లీ పార్టీ ఉంటుందని.. అందుకు అన్ని ఖర్చులు భరిస్తామని కూడా ప్రకటించారని బాధితులు తెలిపారు. అయితే క్రిస్మస్ ముందు రోజు నుంచి విత్ డ్రా చేసుకునే పేమెంట్లు ఆగిపోయాయని చెప్పారు. ఆ తర్వాత గ్రూప్‌‌ల్లో తాము మెసేజ్ చేయకుండా చేశారు. 

తర్వాత మరింత ఆశ కల్పించి.. రెండు గంటల్లోనే విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారని బాధితులు చెప్పారు. క్రిస్మస్ ముందు రోజు రూ.9,980 డివైజ్‌ను యాక్టివేట్‌ చేసుకోకపోతే గ్రూప్ నుంచి టర్మినేట్ చేస్తామని బెదిరించినట్టుగా బాధితులు చెప్పారు. ఇక, డిసెంబర్ 24 రాత్రి లవ్ లైఫ్ యాప్, వెబ్ లింక్స్ ఓపెన్ కాకపోవడంతో తాము మోసపోయామని బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సైబర్ మోసానికి సంబంధించి విజయవాడ,  విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. 

చేర్పించిన వారిపై పెరుగుతున్న ఒత్తిడి..
ఈ యాప్‌లో తొలుత చేరిన వారు ఆదాయం వస్తుండటంతో.. తమకు తెలిసినవారిని, స్నేహితులను, బంధువులను చేర్పించారు. వారు కూడా కొద్ది రోజులు ఆదాయం పొందడం.. భారీగా రివార్డ్స్ ప్రకటించడంతో మరికొందరికి లింక్స్ పంపి చేరమని అడిగారు. అయితే ఇప్పుడు నిర్వహకులు బోర్డు తిప్పేయడంతో కొందరు తమను ఇందులో చేర్పించినవారిపై ఒత్తిడి తెస్తున్నారు. 

click me!