టీడీపీ ఎమ్మెల్యేలు మాపై దాడి చేశారు: స్పీకర్‌కు మార్షల్స్‌ ఫిర్యాదు

By Siva KodatiFirst Published Dec 1, 2020, 10:37 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాంకి మార్షల్స్ ఫిర్యాదు చేశారు. తమపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాంకి మార్షల్స్ ఫిర్యాదు చేశారు. తమపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సస్పెండైన ఎమ్మెల్యేలను తీసుకెళ్లడానికి వస్తే తమపై దాడి చేశారని ఆరోపించారు. మరోవైపు మార్షల్స్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం హామీ ఇచ్చారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వరుసగా రెండో రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు పడింది. మొదటి రోజు 13 మందిని సస్పెండ్ చేసిన స్పీకర్ రెండో రోజు ఒక్క ఎమ్మెల్యే మీదే చర్యలు తీసుకున్నారు.

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీరును గర్హిస్తూ ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో వరద బాధిత రైతులకుపరిహారం గురించే రెండో రోజు కూడా సభలో రభస మొదలైంది.

వరద బాధితులకు బీమా, పరిహారం ఎప్పుడిస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అయితే, ప్రస్తుతం ఎన్యూమరేషన్ జరుగుతోందని, డిసెంబర్ 15 వరకు అది పూర్తయిన తర్వాత డిసెంబర్ 31న వారికి బీమా, పరిహారం అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

ఈక్రమంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర నిరసనకు దిగారు. చంద్రబాబు మినహా మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గర పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలుమార్లు వారు సీట్లలో కూర్చోవాలని సీఎం జగన్, అధికార పక్ష సభ్యులు, స్పీకర్ కోరారు.

అయినా, టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీర్మానం ప్రతిపాదించారు. ఆ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

click me!