భర్తతో మనస్పర్థలు: బిడ్డలను కాలవలోకి తోసిన తల్లి.. తప్పించుకున్న పిల్లలు, మహిళ మృతి

By Siva KodatiFirst Published Jun 5, 2020, 2:47 PM IST
Highlights

విజయవాడలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల నేపథ్యంలో ఓ వివాహిత తన పిల్లలతో సహా కాల్వలోకి దూకింది. ఈ ఘటనలో పిల్లలు తృటిలో తప్పించుకోగా.. తల్లి మాత్రం ప్రాణాలు కోల్పోయింది

విజయవాడలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల నేపథ్యంలో ఓ వివాహిత తన పిల్లలతో సహా కాల్వలోకి దూకింది. ఈ ఘటనలో పిల్లలు తృటిలో తప్పించుకోగా.. తల్లి మాత్రం ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన రాచమళ్ల స్వరూపరాణి (32), విజయవాడ కృష్ణలంకకు చెందిన శ్రీనివాసరావులకు 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది.

ఈ దంపతులకు అభిషేక్ (13), కీర్తన (12) సంతానం. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వరూపారాణి పిల్లలిద్దరిని వెంటబెట్టుకుని బుధవారం 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ బస్టాండ్‌కు చేరుకుంది.

అక్కడి నుంచి దుర్గాఘాట్, ప్రకాశం బ్యారేజ్ తదితర ప్రదేశాల్లో తిరిగి సాయంత్రానికి కార్పోరేషన్ కార్యాలయానికి సమీపంలోని బందరుకాలువ వద్దకు వెళ్లింది. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పిల్లలిద్దరినీ బలవంతంగా కాలువలోకి లాక్కెళ్లి చేతులతో వారిని నీటిలోకి ముంచింది తాను కూడా మునిగింది.

అయితే కాల్వలో నీటిమట్టం 4 అడుగులకు మించకపోవడం, ప్రవాహ వేగం లేకపోవడంతో పిల్లలిద్దరూ స్వరూపరాణి నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. వివాహిత మాత్రం నీటిలోనే మునిగి ప్రాణాలు కోల్పోయింది.

కీర్తన ఒడ్డుకువచ్చి సమీపంలోని వారికి విషయం చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్వరూపరాణి మృతదేహాన్ని వెలికి తీశారు.

మరోవైపు తల్లి నుంచి తప్పించుకున్న అభిషేక్ బస్‌స్టేషన్‌కు చేరుకుని రాజమహేంద్రవరం వెళ్లే  బస్సెక్కి తోటి ప్రయాణికుడి వద్ద ఫోన్ తీసుకుని తల్లి, చెల్లి నీటిలో మునిగిపోయారని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

మరోవైపు అభిషేక్ తప్పించుకున్న విషయం తెలియకపోవడంతో కీర్తన స్థానికుల సాయంతో కాల్వలో గాలింపు చర్యలు చేపట్టింది. అయితే బాలుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులకు తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నాగ స్వరూపారాణి బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె స్వగ్రామం మోర్తలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తల్లిదండ్రులకు ఇటీవల గుండె సంబంధిత శస్త్రచికిత్సలు జరగడంతో కుమార్తె మరణ విషయాన్ని వారికి తెలియనివ్వలేదు.

అంతకుముందు తన భార్య కనిపించడం లేదని రాచమళ్ల శ్రీనివాసు బుధవారం రాత్రి ఉండ్రాజవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈలోగా ఈ విషాదం చోటుచేసుకోవడంతో అతను హుటాహుటిన విజయవాడ బయల్దేరి వెళ్లాడు. 

click me!