ప్రజాస్వామ్యంలో రాజరికమా.. మీది అహంకారం: ఊర్మిళపై మాన్సాస్ ట్రస్ట్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Oct 30, 2020, 4:10 PM IST
Highlights

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారంపై మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌ పర్సన్‌ కార్యాలయం స్పందించింది.

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారంపై మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌ పర్సన్‌ కార్యాలయం స్పందించింది. ఉత్సవాల సందర్భంగా ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌కు ముందు వరుసలో సీటు కేటాయించడం ఆనవాయితీ అని వివరించింది.

కొంతమంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ముందు వరుసలో కూర్చున్నారని పేర్కొంది. పూసపాటి అనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ, ఆమె తల్లి సుధా గజపతి రాజు ఈవో పక్కన కూర్చొని సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారని మాన్సాస్ ట్రస్ట్ వెల్లడించింది.

అయినప్పటికీ తమకు సీట్లు కేటాయించలేదని మీడియాకు చెప్పడం బాధాకరమని సదరు లేఖలో విచారం వ్యక్తం చేసింది. వారిని మహారాణి, రాజ కుమార్తెల్లాగా చూడాలని కోరుకుంటున్నారని, కానీ సిరిమానోత్సవం ప్రజల పండుగని స్పష్టం చేసింది.

ప్రజాస్వామ్యంలోనూ ఇంకా కొంతమంది రాజరికం కోరుకోవడం దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఊర్మిళ తల్లి, ఊర్మిళ ప్రవర్తించిన తీరు అహంకారపూరితమని మాన్సాస్ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా దసర సందర్భంగా గత మంగళవారం పైడితల్లి అ‍మ్మవారి సిరిమానోత్సం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రముఖులు, ప్రజలు తరలివచ్చారు.

అయితే మన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోసం ముందు వరుసలో రిజర్వ్ చేసిన కుర్చీలో ఊర్మిలా, ఆమె తల్లీ కూర్చోవడంపై మన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌ సంచయిత గజపతి రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి తీరును ఖండిస్తూ శుక్రవారం లేఖను విడుదల చేసింది. 

పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా కోట బురుజుపై జరిగిన సంఘటనలో ప్రభుత్వ జోక్యం లేదని, సంచయిత వ్యక్తిగత ప్రమేయంతోనే జరిగిందని పూసపాటి ఆనందగజపతిరాజు కుమార్తె పి.ఊర్మిళ గజపతిరాజు ఆరోపించారు.

ఇంటి ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరుమాను ఉత్సవాన్ని ఏటా కోట బురుజుపై నుంచి తిలకిస్తామన్నారు. మమ్మల్ని ఎవరు అనుమతించారని చైర్‌పర్సన్‌ సిబ్బందిపై ఆగ్రహించడం తగదన్నారు.

ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలిగా నియమించినా తనతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయించలేదని ఊర్మిళ తెలిపారు. తమకున్న హక్కులు పలుమార్లు తెలిపామని, అధికారం శాశ్వతం కాదని ఆమె హితవు పలికారు. 

click me!