మాన్సాస్ ట్రస్ట్‌లో కొత్త వివాదం.. జీతాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు, అశోక్ టార్గెట్‌గా సంచయత ట్వీట్

By Siva KodatiFirst Published Jul 17, 2021, 4:39 PM IST
Highlights

మాన్సాస్ ట్రస్ట్‌లో మరో వివాదం చోటు చేసుకుంది. జీతాలు చెల్లించాలంటూ ట్రస్ట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. దాదాపు 19 నెలల వేతనాలు తమకు రావాలని, వాటిని తక్షణం చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. 
 

విజయనగరం జిల్లా మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 19 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసన తెలిపారు. ఈ అంశంపై ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సంచయిత చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మీ అన్నగారి పుట్టిన రోజున ఇలా ఉద్యోగులతో ధర్నా చేయించడం సిగ్గుచేటంటూ పరోక్షంగా అశోక్ గజపతి రాజును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు సంచయిత. 

అంతకుముందు మాన్సాస్‌ ట్రస్ట్‌ మాజీ చైర్మన్‌, మాజీ మంత్రి పూసపాటి ఆనందగజపతిరాజు 72 వ జయంతిని పురస్కరించుకొని... ఆయన భార్య సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిల గజపతిరాజు స్థానిక రాజుల స్మృతివనంలో ఆనంద గజపతిరాజు సమాధి వద్ద శనివారం నివాళులర్పించారు. అలక్‌ నారాయణ గజపతి రాజు, డా.పీవీజీ రాజుల సమాధుల వద్ద కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Also Read:మాన్సాస్ వివాదంలో కొత్త ట్విస్ట్: అశోక్ గజపతిపై మహిళా కమీషన్‌ను ఆశ్రయించిన సంచయిత

ఈ సందర్భంగా ఊర్మిళ గజపతి రాజు మాట్లాడుతూ... ఆనంద గజపతిరాజు ఆశయాలను ముందుకు తీసుకుపోతామన్నారు. ప్రస్తుత మాన్సాస్‌ ట్రస్ట్‌ లో జరుగుతున్న వ్యవహారంలోనూ, కుటుంబంలో జరుగుతున్న అంశాలు దురదృష్టకరమన్నారు. తన తండ్రి ఆనందగజపతిరాజు బతికుండగానే మాన్సాస్‌ ఆడిట్‌ జరిగిందని, తరువాత ఏమైందో తెలియదని ఊర్మిళ విస్మయాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సౌమిత్రి, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సింహాచలం భూములపై స్పందించారు ఊర్మిళా ఈ విషయంలో ఏం జరుగుతోందో తెలియదని.. తాను కూడా అందరిలా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని చెప్పారు. 

click me!