మహిళా కార్మికులను ఈడ్చుకెళ్లిన పోలీసులు... మంగళగిరిలో ఉద్రిక్తత: లోకేష్ సీరియస్ (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 2, 2021, 12:43 PM IST
Highlights

బకాయి పడ్డ ఐదు నెలల జీతాలను వెంటనే చెల్లించాలంటూ న్యాయబద్దమైన డిమాండ్స్ తో ఆందోళనకు దిగిన మంగళగిరి మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ తప్పుబట్టారు.  

అమరావతి: ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికులు కార్యాలయంలోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేయగా భారీగా మొహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు కార్మిక నాయకులను అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టారు. 

మున్సిపల్ కార్మికుల అరెస్ట్ పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ''మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసి జైలుకి పంపడం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట. దొంగల్ని పెట్టినట్టు కార్మికులను లాకప్ లో బంధించడం వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు చర్య. జీతం వస్తే కానీ పూట గడవని జీవితాలు వారివి. అలాంటిది ఐదు నెలల జీతం రాకపోతే కడుపు మండదా?న్యాయబద్ధంగా రావాల్సిన జీతాల బకాయిలు చెల్లించాలని నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను'' అన్నారు. 

వీడియో

''మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాలుగు రోజులు రిలే నిరాహారదీక్షలు చేసినా పట్టించుకోకపోగా, కనీసం వారి సమస్య గురించి వినడానికి కూడా ఉన్నతాధికారులకు మనస్సు రాలేదు. వెంటనే మున్సిపల్ కార్మికులకు బకాయి ఉన్న జీతాలు చెల్లించాలి. అరెస్ట్ చేసిన కార్మికులను తక్షణమే విడుదల చెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు. 

జీతాలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కార్మికులకు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆందోళనకు దిగిన 10 మంది కార్మికులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

click me!