ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి... ప్రజలు అప్రమత్తంగా వుండాలి: కలెక్టర్ హెచ్చరిక (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 2, 2021, 11:55 AM IST
Highlights

ఎగువ నుండి వరద నీరు పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజి నిండుకుండలా మారింది. దీంతో  30 గేట్లను 2 అడుగుల మేర, 40 గేట్లను 1అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ హెచ్చరించారు. ఈ రోజు(సోమవారం) సాయంత్రానికి ఎగువనుండి ఈ బ్యారేజ్ కి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు రానుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా వుండాలని కలెక్టర్ ఆదేశించారు. 

ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారడంతో 80వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 30 గేట్లను 2 అడుగుల మేర, 40 గేట్లను 1అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగునీటి అవసరాల కోసం తూర్పు, పశ్చిమ కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ బ్యారేజీకి ఇన్ ఫ్లో  83139  క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 73890గా వుంది. 

వీడియో

ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా ఎగువ నుండి భారీ వరద నీరు  వస్తోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువన గల నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. గత వారంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుండి భారీగా వరద నీరు జూరాలకు వచ్చిచేరుతోంది. తుంగభద్ర ప్రాజెక్టుకు కూడ వరద భారీగా వస్తోంది. ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు.

సుమారు 4 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ఎడమ, కుడి విద్యుత్ ప్రాజెక్టుల్లో  విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 50 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 10 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.బుధవారం నాడు రాత్రి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.
 

click me!