మూడు రాజధానుల బిల్లును సమర్ధిస్తున్నా: ఆళ్ల రామకృష్ణారెడ్డి

By Siva KodatiFirst Published Jan 20, 2020, 2:52 PM IST
Highlights

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఆర్‌డీఏ రద్దు బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాజకీయ లబ్ధి కోసమో, మరే లబ్ధి కోసమో కాకుండా ఆ బిల్లు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఈ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఆర్‌డీఏ రద్దు బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాజకీయ లబ్ధి కోసమో, మరే లబ్ధి కోసమో కాకుండా ఆ బిల్లు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఈ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు.

టీడీపీ హయాంలో రైతులను ప్రలోభపెట్టో, భయపెట్టో భూములు లాక్కొన్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అసలు వాస్తవాలు బయటకు రాకుండా అప్పటి ప్రభుత్వం ప్రతిపక్షం గొంతును నొక్కేసిందని ఆర్కే తెలిపారు.

29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసినప్పుడు తానూ సంతోషించానని, కానీ వాస్తవాలను తెలుసుకున్న తర్వాత మోసపోయానని గుర్తించినట్లు రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

రాజధాని ఎంపిక, నిర్మాణం రెండూ కేంద్రప్రభుత్వానిదేనని రాష్ట్ర విభజన చట్టం చెబుతోందని కానీ, చంద్రబాబు సర్కార్ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పడేసిందని ఆయన మండిపడ్డారు. అనుకూల మీడియా సాయంతో చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆర్కే విమర్శించారు.

రాజధానికి అమరావతిని ఆమోదించిన వైఎస్ జగన్.. అదే సమయంలో 30 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అయ్యుండాలని చెప్పారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. కానీ జగన్ చెప్పిన మాటలను వక్రీకరించి టీడీపీ మీడియాలో ప్రచారం చేస్తోందని ఆర్కే చెప్పారు.

రాజధాని ముసుగులో చంద్రబాబు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని కౌలు రైతు వ్యవస్ధను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. మూడు పంటలు పండే భూమిని నాశనం చేసిన చంద్రబాబు తన అభ్యున్నతి కోసం మాత్రం విపరీతంగా శ్రమించారని ఆర్కే ఎద్దేవా చేశారు. 

అమరావతిలో భూములు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేదలేనన్నారు. అందరి అనుమతితోనే రాజధాని తరలింపు, పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని భావించిన సీఎం జగన్.. జీఎన్ రావు కమిటీ, బీసీజీలకు బాధ్యతను అప్పగించారని ఆర్కే గుర్తుచేశారు.

ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ పట్ల చంద్రబాబు ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలిసిందేనని, ఆయనకు దళితులంటే చులకన అని రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా ఉంటుందని ఆర్కే తెలిపారు.

ఓటుకు నోటు కేసుకు భయపడి అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే ఇంతటి అనర్థం జరిగిందని ఆయన వెల్లడించారు.

అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం సంస్థల కార్యాలయాలకు సంబంధించి సంవత్సరానికి రూ.750 కోట్లు అద్దెగా చెల్లిస్తున్నామని ఇది రాష్ట్రానికి ఆర్ధిక భారమని ఆళ్ల వెల్లడించారు. ప్లాట్ల కేటాయింపులో అనుసరించిన కంప్యూటర్ లాటరీ సిస్టమ్‌ను సైతం చంద్రబాబు తనకు నచ్చిన విధంగా చేసుకున్నారని ఆర్కే ఆరోపించారు. 

సీఆర్‌డీఏ పరిధి 8,603 చదరపు కిలోమీటర్లని, అదే సమయంలో హైదరాబాద్‌ను తీసుకుంటే కేవలం 650 చదరపు కిలోమీటర్లు మాత్రమేనని ఆర్కే గుర్తుచేశారు. ల్యాండ్‌పూలింగ్ కింద రైతులు ఇచ్చిన భూమితో పాటు ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుంటే మొత్తంగా 54 వేల ఎకరాలన్నారు.

ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్న భూమిలో ఎవరైనా రైతులు పంట పండించుకుంటానని అడిగితే వారికి అనుమతి ఇవ్వాల్సందిగా ఆర్కే కోరారు. మా ప్రాంతం వాళ్లే ఎప్పటికైనా కింగ్‌మేకర్లం అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమా, రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా అని తనను ఎంతోమంది ప్రశ్నించారని కానీ తనకు రాష్ట్రమే ముఖ్యమని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

శతాబ్ధాల నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలు అన్ని రంగాల్లో ముందున్న సంగతి వాస్తవమన్నారు. తమ లాగే రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆర్కే ఆకాంక్షించారు. అమరావతి ప్రాంతంలో రాజధానిని పెట్టొద్దని తాను 2014లోనే చెప్పానని ఆళ్ల గుర్తుచేశారు.

కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఎకరం కోట్లు పలుకుతున్నాయని.. కానీ ఇంకా వేలాది రూపాయలు కూడా చూడని గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు. 2004 వరకు తనకు సెక్రటేరియేట్ ఎలా ఉంటుందో తెలియదన్నారు. సామాన్యులకు శాసనసభ, సెక్రటేరియేట్‌లతో ఏం పని ఉంటుందని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. 

రాజధాని తరలింపు గురించి అధికారిక ప్రకటన వెలువడకముందే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బీహార్‌, తమిళనాడులో జరుగుతున్న సంఘటనలను అమరావతిలో జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆర్కే విమర్శించారు.

మంగళగిరిలో స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడినే రంగంలోకి దించినా.. ప్రజలు జగన్మోహన్ రెడ్డికే నిలబెట్టిన తనకే అండగా నిలిచారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అమరావతిలో ఎంతో గొప్పగా ఉందని ప్రచారం చేశారని.. కానీ సాయంత్రం ఆరు దాటితే సచివాలయం నుంచి మంగళగిరి వెళ్లడానికి ఆటో కూడా ఉండదన్నారు. 

click me!