కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు ప్రస్తావిస్తూ ఏ పార్టీ మారినా.. తప్పు తప్పే కదా అని అన్నారు. తన కేసు కొనసాగిస్తాననీ అన్నారు.
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్న విషయం తెలిసిందే. వైఎస్ షర్మిలా రెడ్డి వెంట తాను ఉంటానని, ఆమెతోపాటే కాంగ్రెస్‌లోకి వెళ్లుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌లోకి వెళ్లుతున్న తొలి ఎమ్మెల్యేను తానేనని వివరించారు. తాజాగా, ఆయన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పు చేసినా.. అది తప్పేనని ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసును కొనసాగిస్తానని చెప్పారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో నారా లోకేశ్‌ను ఓడించి మంగళగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే సీటు నుంచి ఆయనకు వైసీపీ టికెట్ దక్కుతుందని ఆశించారు. కానీ, మంగళగిరి వైసీపీ ఇంచార్జీగా బీసీ నాయకుడికి బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఆర్కే ఎమ్మెల్యే పదవికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు.
తాజాగా మీడియాతో మాట్లాడుతుండగా.. ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు కదా.. గతంలో మీరు ఓటుకు నోటు కేసులో పిటిషన్ వేయగా.. అందులోని నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా.. అని ఓ విలేకరి ఆరా తీశారు. దీనిపై ఆర్కే స్పందిస్తూ.. తప్పు ఎవరు చేసినా.. తప్పే అవుతుందని అన్నారు.
Also Read: GruhaLaxmi: గృహలక్ష్మీ పథకం కింద ఇల్లు మంజూరైన వారి పరిస్థితి ఏమిటీ? రేవంత్ సర్కారు ఆదేశాలివే
తాను పార్టీ మారాననో, ఆయన పార్టీ మారినంత మాత్రానా తప్పు తప్పు కాకుండా పోదని ఆర్కే స్పష్టం చేశారు. వాళ్లు తప్పు చేస్తుండగా ఆధారాలతో పట్టుబడ్డారు కదా అని అన్నారు. తాను ఆ విషయమై రెండు కేసులు వేశానని, ఆ రెండు కేసులు ఇప్పుడు మెర్జ్ అయి సుప్రీంకోర్టు ముందు ఉన్నాయని వివరించారు. ఇకపైనా తాను ఈ కేసును కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
వైఎస్సార్టీపీ తెలంగాణ కాంగ్రెస్‌లో విలీన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. దీనిపై వైఎస్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో ఆమె చేరుతున్నారు. ఆమె పార్టీలో కీలక పదవి కూడా అధిరోహించనున్నారు. ఆమె వెంటనే ఆర్కే కూడా ఏపీ కాంగ్రెస్‌లోకి వెళ్లుతున్న విషయం తెలిసిందే.