బ్రహ్మోత్సవాల స్పెషల్: తిరుమలలో మండపాల విశిష్టత

By sivanagaprasad KodatiFirst Published Sep 13, 2018, 1:22 PM IST
Highlights

తిరుమల గిరుల్లో అణువణువుకు ఎంతో చరిత్ర ఉంది. ప్రధానంగా తిరుమల ప్రధానాలయం దాని అనుబంధంగా ఉన్న మండలపాలకు చారిత్రక చరిత్ర ఉంది. రాతితో ఎంతో నైపుణ్యంతో మండపాలను తీర్చిదిద్దారు నాటి శిల్పులు.. ఎంతో మంది రాజులు, జమీందారులు, భక్తులు శ్రీవారి మీద భక్తితో తిరుమలలో ఎన్నో మండపాలు నిర్మించారు

తిరుమల గిరుల్లో అణువణువుకు ఎంతో చరిత్ర ఉంది. ప్రధానంగా తిరుమల ప్రధానాలయం దాని అనుబంధంగా ఉన్న మండలపాలకు చారిత్రక చరిత్ర ఉంది. రాతితో ఎంతో నైపుణ్యంతో మండపాలను తీర్చిదిద్దారు నాటి శిల్పులు.. ఎంతో మంది రాజులు, జమీందారులు, భక్తులు శ్రీవారి మీద భక్తితో తిరుమలలో ఎన్నో మండపాలు నిర్మించారు.

శాస్త్రోక్త కార్యక్రమాలకు, వేద పఠనానికి, స్వామి వారి సేవలకు, భక్తులు సేద తీరడానికి ఈ మండపాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఇవి నాటి శిల్పకళకు, శిల్పుల నైపుణ్యానికి మచ్చు తునకలు. తిరుమల ఆలయం పరిసరాల్లో ప్రతిమ మండపం, అద్దాల మండపం, రంగ మండపం, తిరుమలరాయ మండపం, ధ్వజస్తంభ మండపం, నాలుగు కాళ్ల మండపం, కళ్యాణ మండపం, మహామణి మండపం, స్నపన మండపం, శయన మండపం ప్రధానమైనవి..

ప్రతిమ మండపం:
ఈ మండపం 16 స్తంభాలను కలిగి ఉంటుంది.. దీనిని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయులు నిర్మించారు. స్వామి వారి మహా ద్వారం పక్కన ఈ మండపం ఉంటుంది.. దీనిలో శ్రీకృష్ణదేవరాయలు, అతని ఇద్దరు రాణులు తిరుమల దేవి, చిన్నాదేవిల రాగి విగ్రహాలు ఉన్నాయి.. ఈ మండపంలో ప్రస్తుతం తులాభారం కూడా ఉంది.. వీటితో పాటు వివిధ వాహన సేవలలో భక్తులకు దర్శనం ఇచ్చిన  తర్వాత స్వామి వారు ఇక్కడ సేద తీరుతారు.

అద్దాల మండపం
రంగమండపానికి ఉత్తరంవైపున నెలకొని ఉంది అద్దాల మండపం.. ఈ మహాల్ మధ్య చతురస్రాకారమయిన చిన్న మండపం ఉంది.. దీనిలో ఉయ్యాల కూడా ఉంటుంది. చుట్టూ అద్దాలు ఉండటం వల్ల లెక్కలేనన్ని ప్రతిబింబాలు కనిపిస్తాయి.. 1831లో దీనిని నిర్మించినట్లుగా ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ మండపంలో స్వామి వారికి ఉభయ దేవేరులతో ఊంజల్ సేవను నిర్వహిస్తారు.

రంగమండపం లేదా రంగనాయక మండపం
శ్రీవారి ఆలయంలోకి భక్తులు ప్రవేశించగానే ఎడమవైపు ఎత్తైన శిలావేదికపై కనిపించేదే రంగనాయక మండపం. దీనినే రంగమండపం అని కూడా అంటారు. ఇది 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో అతిపెద్ద రాతి స్తంభాలతో ఉంటుంది. ఈ మండపాన్ని రంగనాథయాదవరాయలు కట్టించారని చెబుతారు.

ఆ మండపంలో స్వామివారు అర్చనలు, నైవేద్యాలు స్వీకరిస్తారు. వేద పండితులు స్వామి వారికి స్నపన తిరుమంజనం ఇక్కడే చేయిస్తారు. వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే వీవీఐపీలు, వీఐపీలకు రంగనాయక మండపంలోనే వేదపండితులు ఆశీర్వచనం చేస్తారు.

తిరుమలరాయ మండపం
రంగమండపానికి పశ్చిమదిశలో ఉండే మండపాన్ని తిరుమలరాయ మండపం అంటారు.. దీనికే ‘‘ అన్జా ఊంజల్ మండపం’’ అని మరో పేరు.. ఈ మండపాన్ని సాళువ నరసింహరాయులు కట్టించారు.. శ్రీవారి ధ్వజస్తంభానికి ఎడమవైపు పది అడుగుల దూరంలో తిరుమలరాయ మండపం ఉంటుంది. ఇక్కడ ఊంజల్ సేవతో పాటు బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజావరోహణ సందర్భంగా ఉత్సవ మూర్తులను ఇక్కడే ఉంచుతారు.

ధ్వజస్తంభ మండపం

ఎత్తైన స్తంభాలతో నిర్మితమైన రాతి మండపం ధ్వజస్తంభ మండపం. దీనిని 15వ శతాబ్ధంలో నిర్మించారు.. ఇక్కడ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతో పాటు ధ్వజావరోహణ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

నాలుగు స్తంభాల మండపం:
దీనిని 1470లో సాళువ నరసింహరాయులు నిర్మించారు..  ఈ మండపంలో ఉట్లోత్సవాన్ని నిర్వహిస్తారు.

కల్యాణ మండపం
సంపంగి మండపానికి దక్షిణంవైపు నెలకొని ఉంది నాలుగు స్తంభాల మండపం.. ఇక్కడ స్వామి వారికి కల్యాణం జరుపుతారు.. అలాగే పుష్పయాగం, జ్యేష్టాభిషేకం, పవిత్రోత్సోవం కార్యక్రమాలను నాలుగు స్తంభాల మండపంలో నిర్వహిస్తారు.

మహామణి మండపం
శ్రీవారి బంగారు వాకిలికి గరుడ మందిరానికి మధ్యలో ఈ మహామణిమండపం నెలకొని ఉంది.. దీనిని 1417లో నిర్మించారు. 16 స్థంభాలతో కూడుకున్న దీనిపై నరసింహ స్వామి, వరాహా స్వామి, మహా విష్ణువుతో పాటు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలను చెక్కించారు. ఈ మండపంలో నిత్యం పంచాంగ శ్రవణం, సుప్రభాతంతో పాటు సహస్ర కళశాభిషేకం, తిరుప్పావడ సేవ మొదలైన ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. ఈ మండపంలో రెండు పెద్ద గంటలు ఉన్నాయి.. ప్రతి రోజు ఆనంద నిలయంలో సేవా కార్యక్రమాల సందర్భంగా దీనిని మోగిస్తూ ఉంటారు.

స్నపన మండపం:
చతురాస్రకారంలో ఉండే ఈ మండపం బంగారు వాకిలికి వెనుక వైపు ఉంటుంది.. ఇందులో పల్లవ మహారాణి పెరున్ దేవి బహుకరించిన భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహం ప్రతిష్టించారు.

శయన మండపం
ఇది రాములవారి మేడకు వెనుక వైపున వుంటుంది. ఇక్కడ శ్రీవారికి బంగారు మంచంపై ఏకాంత సేవను జరుపుతారు. దీనితో పాటు నిత్య ఆర్జిత సేవలైన తోమాల సేవ, సుప్రభాత సేవ, అన్నమాచార్య సంకీర్తనం నిర్వహిస్తారు. రాత్రి పూట దివ్య ప్రబంధం, సహస్రనామ పఠనం, వేద పఠనం చేస్తారు.. భక్తులు ఆర్జిత సేవ టిక్కెట్లను కొనుగోలు చేసి ఈ సేవలను వీక్షించవచ్చు. 

వీటితో పాటుగా తిరుమలలో అంకురార్పణ మండపం, పరకామణి మండపం, ప్రదక్షిణ మండపం, గొల్ల మండపం, పార్వేట మండపం, వసంతోత్సవ మండపం, సహస్ర దీపాలంకరణ సేవ కొలువు మండపం, వాహన మండపం, నాద నీరాజన మండపం, ఆస్థాన మండపం మొదలైనవి వున్నాయి. 
 

click me!