
ఆ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. దీంతో స్కూలుకి పంపాల్సిన తమ మైనర్ బాలికను కూడా పనిలో కుదిర్చారు. కాగా.. వెంట వచ్చిన అభం శుభం తెలియని ఆ బాలికపై యజమాని కన్నేశాడు. బాలికను బెదిరించి.. మత్తుమందు ఇచ్చి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని అఘాయిత్యాలకు భార్య సహకరించడం గమనార్హం. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... వలేటివారిపాలెం మండలం వలేటివారి పాలేనికి చెందిన దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నారు. ఈ క్రమంలో పోషణ కష్టంగా ఉండటంతో తమ 15ఏళ్ల కుమార్తెను యుగంధర్- నాగమణి దంపతుల వద్ద పనికి కుదిర్చారు. యుగంధర్ దంపతులు పలు రాష్ట్రాల్లోని రహదారుల వెంట సోఫాలు, కుర్చీలు అమ్ముకుంటూ ఉంటారు. స్వగ్రామంలో బాతు గుడ్ల వ్యాపారం చేసుకుంటారు.
కాగా.. పని నిమిత్తం తమ వద్ద చేరిన బాలికను యుగంధర్ దంపతులు తమతోపాటు ఢిల్లీ తీసుకువెళ్లారు. అక్కడ వారు బాలికకు నరకం చూపించేవారు. బాలికను బెదిరించి యుగంధర్ పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త చేస్తున్న పనిని అడ్డుకోవాల్సిందిపోయి భార్య అతనికి పూర్తిగా సహకరించడం గమనార్హం.
అనంతరం బాలికను ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టారు. ఆ తర్వాత బాలిక గర్భం దాల్చిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో.. తమ కూతురి జీవితం నాశనమైందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ప్రస్తుతం బాలిక ఐదు నెలల గర్భిణి. ఇదిలా ఉండగా.. నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.