ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యేలనే మోసం చేశాడు. ముఖ్యమంత్రి ఆఫీసునుంచి మాట్లాడుతున్నానంటూ డబ్బులు డిమాండ్ చేశారు. అలా తన ప్రియురాలికి ఏకంగా రూ. 80లక్షలతో ఇల్లు కొనిచ్చాడు. అయితే మోసం బయటపడడంతో...
విశాఖపట్నం : రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన అభియోగాలపై విశాఖలోని గాజువాక శ్రీనగర్ కు చెందిన నిందితుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. పి.విష్ణుమూర్తి (20) అలియాస్ సాగర్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే సందీప్ యాదవ్ కు పలుమార్లు ఫోన్లు చేసి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, రూ. 20లక్షలు పంపాలి అని కోరాడు. దీంతో ఆ ఎమ్మెల్యే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జితేంద్రసిం్ నాయకత్వంలోని సిబ్బంది ఫోన్ లొకేషన్ ఆధారంగా గాజువాక శ్రీనగర్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ పై నిందితుడిని రాజస్థాన్ తీసుకువెళ్లారు.
సీఎంవో నుంచి మాట్లాడుతున్నాను అంటూ.. కృష్ణమూర్తి అక్కడి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి దాదాపు రూ.2.5కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేల నుంచి వసూలు చేసిన డబ్బుల్లో రూ.80 లక్షలతో ప్రియురాలికి గాజువాకలో ఇల్లు కొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విష్ణుమూర్తిపై గతంలోనూ విశాఖ సైబర్ క్రైమ్, కాశిబుగ్గ పిఎస్ లో మొత్తం నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన నిందితుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2019లోనూ ఏపీలో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ. 1.80 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
undefined
ఇదిలా ఉండగా గుంటూరులో కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఓ అమాయక మహిళను మోసం చేశాడో వ్యక్తి. కొడుకుకు జీవితం బాగుపడుతుందని భావించిన ఆమె.. తనుంటున్న సొంతింటిని తనఖా పెట్టి రూ.25లక్షలు ఇచ్చి మోసపోయింది. ఇప్పుడు అటు కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం రాక, ఇటు నివాసముంటున్న ఇళ్లు విడిచిపెట్టాల్నిన పరిస్థితి రావడంతో తీవ్ర మనోవేదనకు గురయింది. దీంతో తల్లీ కొడుకు ఇద్దరూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
వివరాల్లోకి వెళితే... మంగళగిరి, తాడేపల్లిలోని నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో నందం రామకుమారి.. తన కొడుకు మణికంఠతో కలిసి జీవిస్తోంది. కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయిన ఆమె గ్రామంలోనే రేషన్ దుకాణంతో పాటు టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఎంబిఏ చదివిన మణికంఠ కొన్నేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో మంచి జీతంతో ఉద్యోగం చేసేవాడు. అయితే ఒక్కగానొక్క కొడుకు దూరంగా వుండటంతో రామకుమారి ఒంటిరిగా వుండలేకపోయింది. దీంతో కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం వుంటే తనవద్దే వుంటాడని భావించింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈ క్రమంలోనే తాను జర్నలిస్టునని... ముుఖ్యమంత్రి కార్యాలయంలో తనకు తెలిసినవారు వున్నారంటూ రామకుమారిని సంజీవ్ అనే వ్యక్తి నమ్మించాడు. తనకు తెలిసిన వారి ద్వారా కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ పలికాడు. ఇందుకోసం రూ.25లక్షలు డిమాండ్ చేశాడు. అతడి మాటలు నమ్మిన ఆమె ఇంటిని తనఖా పెట్టి మరీ డబ్బులు చెల్లించింది. కొడుకును కూడా బెంగళూరులో ఉద్యోగం మాన్పించి ఇంటికి పిలిపించుకుంది.