గుంటూరులో ఓ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. పట్నా గ్రీన్ కంపెనీ ఏజెంట్‌నంటూ శ్రీకాకుళానికి చెందిన జనార్థన్ అనే వ్యక్తి గుంటూరు జిల్లాలోని కొందరిని బురిడీ కొట్టించాడు.
రోజూ ఎన్ని వార్తలు వస్తున్నా.. పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. ఈజీ మనీకి అలవాటుపడిన జనం కేటుగాళ్ల వలకి చిక్కి నిండా మునుగుతున్నారు. వందల్లో పెట్టుబడి పెడితే వేలల్లో, లక్షల్లో ఆదాయం వస్తుందంటూ ఊరించి ప్రజలను నిలువునా దోచేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా గుంటూరులో ఓ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. పట్నా గ్రీన్ కంపెనీ ఏజెంట్‌నంటూ శ్రీకాకుళానికి చెందిన జనార్థన్ అనే వ్యక్తి గుంటూరు జిల్లాలోని కొందరిని బురిడీ కొట్టించాడు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని మాయమాటలు చెప్పాడు. రూ.11 వేలు కడితే నాలుగు నెలల్లోనే రూ.64 వేలు ఇస్తామని.. అదే లక్ష పెట్టుబడిగా పెడితే.. ఏడాదికల్లా రూ.13.94 లక్షలు ఇస్తామని ఆశపెట్టాడు.
దీనిని నిజమేనని నమ్మిన జనం తాము పెట్టుబడి పెట్టడమే కాకుండా తమ సన్నిహితులను కూడా బలి చేశారు. అలా గుంటూరు, బెల్లంకొండ ప్రాంతాలకు చెందిన పలువురు జనార్థన్ పంపిన వాట్సాప్ లింక్‌లో డబ్బులు వేశారు. అయితే రోజులు గడుస్తున్నా తమకు ఎలాంటి లాభాలు ఇవ్వకపోవడంతో బాధితులు జనార్థన్‌ను నిలదీశారు. ఆ వెంటనే అతను వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంను సైతం మూసేశాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.