మైనర్ ను ప్రేమించి.. పెళ్లి పేరుతో నమ్మించి.. రూ.11 లక్షలు మోసం..

By SumaBala Bukka  |  First Published Jun 25, 2022, 1:59 PM IST

ప్రేమపేరుతో మైనర్ బాలికను నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. ఆమె దగ్గరినుంచి రూ.11 లక్షలు కాజేశాడో ప్రబుద్ధుడు. 


యలమంచిలి : పెళ్లి పేరిట మైనర్ యువతిని మోసం చేసిన యువకుడిమీద యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెదపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మోసపోయిందని తండ్రి యలమంచిలి రూరల్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సన్నిబాబు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. యలమంచిలి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన మైనర్ యువతిని (16)ను కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన బొద్దపు నానాజీ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె నుంచి దశలవారీగా రూ.11 లక్షలు కాజేశాడు. ఇంటిలో పెట్టిన డబ్బు కనిపించకపోవడంతో తండ్రి కూతురుని ప్రశ్నించగా విషయం బయట పడింది. 

దీంతో తండ్రి రూరల్ పోలీసులను ఆశ్రయించి యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడు నానాజీతో కలిసి అతని పిన్నమ్మ కరణం వెంకట లక్ష్మి, తల్లి బొద్దపు పాప, చెల్లి లల్లీలు కూడా తమ కుమార్తెను ఏమార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోల్ యలమంచిలి రూరల్ స్టేషన్ కు వచ్చి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన సూచన మేరకు పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. మొదట రూ. 2 లక్షల వరకు ఫోన్ పే ద్వారా... తర్వాత రూ. 6లక్షలు నేరుగా నగదు రూపంలో ఇచ్చినట్లు, మిగిలిన డబ్బు దశలవారీగా ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నలుగురిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Latest Videos

undefined

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు మరోసారి అస్వస్థత

ఇదిలా ఉండగా మరో ఘటనలో ఒక  వితంతువును ట్రాన్స్ కో ఉద్యోగి తన కోరిక తీరిస్తే కుటుంబానికి అండగా ఉంటానంటూ వెంటపడుతున్నాడు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటాను తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే ప్రసక్తే లేదని ఆమె తెలియచెప్పింది. అయినా ఆ ఉద్యోగి వేధింపులు ఆపడం లేదు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను అనంతపురం టౌన్ సీఐ రాఘవన్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

శారద నగర్ లో ఉంటున్న ఓ మహిళ భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. భర్త మరణానంతరం కుటుంబ భారం ఆమెపై పడింది. అప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్ల వద్దకు వెళ్ళి.. వారికి సపర్యలు చేసి..  వచ్చే సంపాదనతో  పిల్లలను పోషించుకుంటోంది. నడిమివంక ప్రాంతంలో నివాసం ఉంటున్న వితంతువు తల్లికి నాలుగో రోడ్డులో నివాసముంటున్న ట్రాన్స్కో కార్యాలయం అటెండర్ అబ్దుల్ నబీసాబ్ పరిచయం ఉంది. అలా అన్ని విషయాలు తెలుసుకున్న ఇతడు వితంతుపై మోజు పడ్డాడు.

తన కోరిక తీరిస్తే ఆమె కుటుంబ బాగోగులు చూసుకుంటానని నమ్మబలికాడు. ఇందుకు వితంతువును ఒప్పించే విషయంలో తల్లి కూడా ఒత్తిడి తీసుకు వచ్చింది. అయితే ఇందుకు వితంతువు ససేమిరా ఒప్పుకోలేదు. నెల రోజుల క్రితం అబ్దుల్ నబీసాబ్ వితంతువు ఇంటికి వెళ్లి ఒప్పుకోవాలంటూ బలవంత పెట్టాడు. ఆమె ఈసారి ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఇళ్ళల్లో పని చేసుకునైనా పిల్లలను పోషించుకుంటాను తప్పా.. నీలాంటి వాడితో ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

మరోసారి వెంటపడి వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. అయినా అతనిలో మార్పు రాలేదు. మళ్లీ వేధింపులకు దిగుతుండడంతో వితంతువు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రాఘవన్ కు ఫిర్యాదు చేసింది. సీఐ ఆదేశాల మేరకు ఎస్ఐ అల్లా బకాష్ విచారణ చేపట్టిన తర్వాత ట్రాన్స్కో ఉద్యోగి అబ్దుల్ నబీసాబ్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వితంతువు తల్లి పైనా కేసులు నమోదు చేశారు. 

click me!