
పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తిపై ఎస్‌ఐ చితకబాదాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా చిలమత్తూరులో చోటుచేసుకుంది. వివరాలు.. వికలాంగురాలికి పెన్షన్ మంజూరు చేపిస్తానని చెప్పి స్థానిక వైసీపీ నాయకుడు దామోదర్ రెడ్డి డబ్బు తీసుకుని మోసం చేశాడని బాధితుడు వేణు ఆరోపించాడు. దామోదర్ రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలో తనపై దాడి చేసి అక్రమ కేసు బనాయించారని చెబుతున్నాడు. ఇదే విషయాన్ని ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్లేందుకు పోలీసు స్టేషన్‌కు వెళితే.. తనను దూషిస్తూ, దాడి చేశాడని చెప్పాడు. ఇక, వేణును ఎస్‌ఐ కొడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వాదన మరోలా ఉంది. మద్యం మత్తులో ఉన్న వేణు సంజీవరాయనిపల్లెలో న్యూసెన్స్ చేస్తుండగా కానిస్టేబుల్ అడ్డుపడ్డాడని పోలీసులు చెబుతున్నారు. అడ్డుపడ్డ కానిస్టేబుల్‌పై వేణు తిరగబడ్డాడని.. ఆ విషయంలోనే తాము అతడిని మందలించామని తెలిపారు. ఆ విషయాన్ని కవర్ చేయడానికే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు.
అయితే వేణును ఎస్‌ఐ కొడుతున్న వీడియో మాత్రం వైరల్‌గా మారింది. అందులో ఎస్‌ఐ.. వేణును చితక్కొట్టడంతో పాటుగా బూతులు కూడా తిట్టారు.ఈ వీడియో చూసినవారిలో పలువురు ఎస్‌ఐ ఇలా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.