ఆస్తికోసం.. బామ్మర్థిని చంపి, గోతిలో పూడ్చిపెట్టిన బావ.. రెండునెలల తరువాత వెలుగులోకి..

Published : Aug 04, 2022, 10:49 AM IST
ఆస్తికోసం.. బామ్మర్థిని చంపి, గోతిలో పూడ్చిపెట్టిన బావ.. రెండునెలల తరువాత వెలుగులోకి..

సారాంశం

ఆస్తికోసం బావమరిదిని కిరాతకంగా హతమార్చాడో బావ. పెళ్లిచేసుకుని ఇల్లరికం వచ్చిన అతను అత్త ఆస్తిమీద కన్నేసి.. అడ్డుగా ఉన్న బావమరిదిని చంపేశాడు. 

అనంతపురం :  బావబామ్మర్దుల బంధం.. రక్తం పంచుకుపుట్టిన అన్నాదమ్ముల బంధం కంటే బలమైంది అంటారు. అయితే, ఇక్కడ  అందుకు భిన్నంగా జరిగింది. ఆస్తి కోసం బావమరిదిని స్వయనా.. అక్క భర్త.. బావే హత్య చేశాడు. ఆ తరువాత ఎవరికీ తెలియకుండా పూడ్చి పెట్టాడు. రెండున్నర నెలల తరువాత అసలు విషయం వెలుగు చూసింది. కంబదూరు మండలం ములకనూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల మేరకు…ములకనూరు గ్రామానికి చెందిన దండా శారదమ్మకు అఖిల్ (15) అనే కుమారుడితో పాటు వర్షిత, త్రిష అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అఖిల్ గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పెద్ద కుమార్తె  8 నెలల క్రితం గుద్దెళ్ల గ్రామానికి చెందిన అనిల్ తో వివాహం అయింది.

పెళ్లయిన తరువాత అనిల్ తన భార్యతో కలిసి అత్తవారిఇంట్లోనే ఉంటున్నాడు. గ్రామంలోశారదమ్మకు 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అనిల్ కన్ను ఆ భూమిపై పడింది. శారదమ్మ ఏకైక కుమారుడైన అఖిల్ ను అడ్డు తొలగించుకుంటే భూమి తన సొంతమవుతుందని భావించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 21న ములకనూరులో జరిగిన తిమ్మప్ప జాతర సందర్భంగా అఖిల్ కు సెల్ఫోన్ కొనిస్తా అని నమ్మించి, బైక్ మీద ఎక్కించుకుని.. గుద్దెళ్ల సమీపంలోని తన వ్యవసాయ తోటలోకి తీసుకువెళ్ళాడు.

తూ.గో జిల్లాలో విషాదం: ఫిల్టర్ శుభ్రం చేస్తున్నఇద్దరు కార్మికులు మృతి

అక్కడ కొడవలి, కర్రలతో దాడి చేసి చంపేసి, తర్వాత డ్రిప్ వైరుతో శరీరాన్ని బిగించి సమీపంలోని వంకలో పూడ్చిపెట్టాడు. మరుసటి రోజు తన కుమారుడు కనిపించలేదని అఖిల్ తల్లి శారదమ్మ కంబదూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, అనిల్ నెల రోజులుగా కనిపించకుండా పోవడంతో పాటు.. అఖిల్ కనిపించకుండా పోయిన రోజు అనిలే అతడిని బైక్పై ఎక్కించుకుని వెళ్లిన విషయం తెలిసింది. దీంతో శారదమ్మకు అల్లుడిపై అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. 

బుధవారం కదిరిదేవరపల్లి రైల్వేస్టేషన్లో అనిల్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. అత్త భూమి కోసం తానే బావమరిదిని చంపి, పూడ్చి వేశానని అనిల్ అంగీకరించాడు. దీంతో సీఐ శ్రీనివాసులు, ఎస్సైరాజేష్ అతన్ని తీసుకుని అఖిల్ ను పూడ్చి పెట్టిన స్థలానికి వెళ్లారు. అక్కడ తాసిల్దార్ నయాజ్ అహ్మద్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీయించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉండడంతో అక్కడే డాక్టర్లు శ్రీనివాస్ నాయక్, రాధా పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

కూతుర్ని, అల్లుడిని నా దగ్గరే పెట్టుకుని సంసారం అంతా చూసుకుంటిని.. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇంత దారుణంగా చంపడానికి చేతులెలా వచ్చాయిరా? ఇన్ని రోజులు చెప్పకుండా ఎంత బాగా నటించినావురా...అంటూ అఖిల్ తల్లి శారదమ్మ గుండెలవిసేలా రోదించారు. ఇలాంటి  వాడిని వదలొద్దు సార్.. చంపేయండి.. అంటూ పోలీసులను వేడుకోవడం అక్కడున్న వారందరినీ కలచివేసింది. 
 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన డా. ఉండవల్లి శ్రీదేవి: Womens Reservation | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu