అవ్వా బాగున్నావా? అంటూ.. నగదు చోరీ...

By AN TeluguFirst Published Feb 4, 2021, 9:44 AM IST
Highlights

అవ్వా బాగున్నావా? నేనెవరో తెలుసా? అంటూ మాటలు కలిపి మోసం చేస్తున్న ఓ వ్యక్తిని బుధవారం చిత్తూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా మాటలు కలిపి నగలు, నగదును దోచుకుంటున్న సంఘటనలు ఇటీవల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. 

అవ్వా బాగున్నావా? నేనెవరో తెలుసా? అంటూ మాటలు కలిపి మోసం చేస్తున్న ఓ వ్యక్తిని బుధవారం చిత్తూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా మాటలు కలిపి నగలు, నగదును దోచుకుంటున్న సంఘటనలు ఇటీవల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. 

పలమనేరులో జరిగిన ఈ ఘటన ఆధారంగా పోలీసులు మోసగాడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే గంగవరం మండలం కలిమిచెట్లపెంటకు చెందిన మునిరత్నమ్మ(65) మంగళవారం సొంతపనిపై పలమనేరుకు వచ్చింది. 

బజారువీధిలో వెళుతుండగా ఓ అపరిచితుడు మునిరత్నమ్మతో మాటలు కలిపాడు. నాది కూడా చిత్తూరేనని, మీ కొడుకు దోస్తును అంటూ పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా అర్జెంట్‌గా తన తల్లి మునిరత్నమ్మ వద్ద రూ.20 వేలు  తీసుకుని రావాలని ఆమె కొడుకు తనను పంపాడంటూ నమ్మబలికాడు. 

మనవరాలికి ఆరోగ్యం బాగాలేక ఆమె కొడుకు చిత్తూరుకు వెళ్లడం నిజమే కావడంతో అతడు చెప్పేది వాస్తవేననుకుంది మునిరత్నమ్మ. మనవరాలికి ఎలా ఉందో.. ఎంత ఆపదలో ఉందోనని భావించింది, తన దగ్గర నగదు లేదని చెవికమ్మల్ని అక్కడి ఓ బంగారు దుకాణంలో కుదువ పెట్టి రూ.25వేలు తీసుకుంది. అందులో రూ.5వేలు తాను ఉంచుకుని, రూ.20వేలు అతనికిచ్చి పంపింది. 

తిరిగి ఊరికి వెళ్లిన మునిరత్నమ్మ సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుకుకు ఈ విషయం చెప్పింది. అతను అది విని అవాక్కయ్యాడు. మోసం జరిగిందని అర్థమై.. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దీనిపై విచారణకు దిగిన పోలీసులు గతంలో ఇలాంటి నేరాలు చేసిన వ్యక్తుల ఫొటోల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు చిత్తూరులోని మిట్టూరుకు చెందిన సెంథిల్ కుమార్ (35) అని తెలిసింది. బుధవారం అతడిని అరెస్ట్ చేసి, అతని దగ్గరినుండి రూ.20వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. 

ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువవుతుండడంతో పరిచయం లేని వ్యక్తుల మాటలు నమ్మి ఏంటిఎం కార్డులు, నగలు, నగదు లాంటివి ఇవ్వద్దని ఎస్ఐ నాగరాజు ప్రజల్ని హెచ్చిరించారు. 

click me!