మాధవీ రెడ్డి.. కన్ను కొట్టి కడప గెలిచింది

By Galam Venkata Rao  |  First Published Jun 6, 2024, 12:10 PM IST

చంద్రబాబు శపథం చేసి మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. పిఠాపురంలో బంపర్ మెజారిటీతో గెలిచిన పవన్ కల్యాణ్ కూడా తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. వీరు సవాల్ చేసి నెగ్గితే.. ఓ టీడీపీ అభ్యర్థి కన్ను కొట్టి గెలిచారు. కడపను సొంతం చేసుకున్నారు..


వైసీపీ కంచుకోటలో టీడీపీ జెండా పాతింది. జిల్లా కేంద్రమైన కడపలో వైసీపీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాను టీడీపీ మహిళా అభ్యర్థి మట్టి కరిపించారు. కూటమి తరఫున బరిలో నిలిచిన రెడ్డెప్పగారి మాధవీరెడ్డి అత్యధిక మెజారిటీతో విజయ కేతనం ఎగురవేశారు. 

Latest Videos

undefined

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి సతీమణే మాధవీరెడ్డి. ఎన్నికలకు కొద్ది నెలల ముందు కడప ఇంఛార్జిగా మాధవి నియమితులయ్యారు. ఆ తర్వాత ఎంతో ఉత్సాహంగా కడపలో పనిచేశారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వైసీపీ విధానాలను ఎండగట్టారు. ఎన్నికల ముందు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కడపలో నిర్వహించిన ప్రచార సభలో మాధవి కన్ను కొట్టడం వైరల్ అయింది. చంద్రబాబు సీరియస్‌గా మాట్లాడుతుంటే మాధవి సభ వేదికపై సీట్లో కూర్చొని నాయకులతో మాట్లాడుతూ ఉంటుంది. వేదిక కింద ఉన్న వారు ఏం చెప్పారో తెలియదు కానీ, మాధవి ఉన్నట్టుండి కన్ను కొట్టారు. ఈ రెండు, మూడు సెకన్ల వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అయింది. వైసీపీ కూడా దీన్ని విపరీతంగా ట్రోల్‌ చేసింది. 

 

 

ఇలా వైసీపీ ట్రోలింగ్‌ చేయడం వల్ల తన మొదట బాధ పడ్డప్పటికీ.. చివరికి తనకే లాభం జరిగిందంటారు మాధవి. వేదికపై తాను చేసిన ఒకటీ రెండు సెకన్ల గెశ్చర్లు తీసుకొని వైసీపీ ట్రోల్‌ చేయడం తనకు మొదట ఓ పెద్ద ఝలక్‌ అట... ఇది చూసి రెండు మూడు వారాలు చాలా బాధపడ్డారట. అయితే , వైసీపీ వాళ్ల ట్రోలింగ్‌ వల్ల సోషలహ మీడియా ఫాలోయింగ్‌ పెరిగిందని.. తానెంతో కష్టపడ్డా రాని ఫాలోయింగ్‌ వచ్చిందని చెబుతారు. తనపై చేసిన ట్రోలింగుల వెనుక అంజాద్‌ బాషా పిఎ ఉన్నారని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో చెప్పుకొచ్చిన మాధవి.. దాని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారట. 

 

 

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) కంచుకోట కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ (TDP) అనూహ్యంగా గెలిచింది. కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డప్పగారి మాధవి రెడ్డి ఘన విజయం సాధించారు. డిప్యూటీ సీఎం, వైసీపీ అభ్యర్థి అయిన అంజాద్‌ బాషాపై నెగ్గారు. ఈ ఎన్నికల్లో మాధవి 90,988 ఓట్లు దక్కించుకొని... 18,860 మెజారిటీ దక్కించుకున్నారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అంజాద్‌ బాషాకు 72,128 ఓట్లు మాత్రమే రావడంతో కడపలో మాధవి విజయం ఖరారైంది. 

ఇక, కడపలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే తన లక్ష్యమని రెడ్డప్పగారి మాధవి చెబుతున్నారు. మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానంటున్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు ప్రతి నెలా కడపలో మహిళా దర్బార్ నిర్వహించి... మహిళలకు ప్రభుత్వం ఇచ్చే  పథకాలన్నీ సక్రమంగా చేరేలా చూస్తానని చెబుతున్నారు.

వైఎస్ కుటుంబానికి కడప ఎంతో స్పషల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉమ్మడి రాష్ట్రమైనా, నవ్యాంధ్ర అయినా కడప చుట్టూనే తిరుగుతాయి. దేశానికి, రాష్ట్రానికి ఉద్ధండులైన నేతలను అందించింది ఈ గడ్డ. వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంపై సీఎం జగన్ దృష్టి సారించారు. పులివెందుల, కడప జగన్ ఫ్యామిలీకి రెండు కళ్లలాంటివన్న సంగతి రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. అందుకే రాజకీయాల్లో , పాలనలో ఎంత బిజీగా వున్నా ఈ రెండు నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యులను నియమించి ఎప్పటికప్పుడు ఓ కన్నేసి వుంచుతారు జగన్. 

1952లో కడప నియోజకవర్గం ఏర్పడగా.. కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ రెండు సార్లు విజయం సాధించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన తర్వాత కడపలో జగన్ పార్టీ ఓడిపోలేదు. ఈ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రెడ్డి, ముస్లిం మైనారిటీ, దళిత వర్గాలు కడపలో అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మైనారిటీలు అత్యధికంగా 8 సార్లు విజయం సాధించారంటే వారికి ఇక్కడనున్న పట్టును అర్ధం చేసుకోవచ్చు.

1994 నుంచి నేటి వరకు కడపలో అన్ని పార్టీలు ముస్లింలకే టికెట్‌ను కేటాయిస్తూ వస్తుండగా వారే గెలుస్తున్నారు. కడప నుంచి అంజాద్ భాషా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ తరపున 2014, 2019 ఎన్నికల్లో భాషా గెలుపొందారు. కడప శాసనసభ నియోజకవర్గంలో 2,65,154 మంది ఓటర్లున్నారు. కడప నగరం మొత్తం ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. 2019  అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి అంజాద్ భాషాకు 1,04,822 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి అమీర్ బాబుకు 50,028 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 54,794 ఓట్ల తేడాతో కడపను దక్కించుకుంది. 

పాతికేళ్ల తర్వాత... 

కడపను నిలబెట్టుకోవాలని జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు సీఎం జగన్‌. సిట్టింగ్ ఎమ్మెల్యే అంజాద్ భాషానే ఎన్నికల బరిలోకి దించారు. నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ వర్గాల్లో వున్న పలుకుబడి, నగరాభివృద్ధి కార్యక్రమాలు, జగన్ ఛరిష్మా తనను మరోసారి గెలిపిస్తాయని అంజాద్ భాషా గట్టి ధీమాతో వున్నారు. టీడీపీ విషయానికి వస్తే .. ఆ పార్టీ ఇక్కడ గెలిచి పాతికేళ్లు అవుతోంది. 1999లో చివరిసారిగా తెలుగుదేశం పార్టీ కడపలో విజయం సాధించింది.  కానీ ఈసారి ఎలాగైనా కడప గడ్డపై పసుపు జెండా రెపరెపలాడించాలని చంద్రబాబు భావించారు. ఈసారి మాత్రం చంద్రబాబు ప్రయోగం చేసి రెడ్డి సామాజికవర్గానికి చెందిన మాధవీ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించగా.. విజయం సాధించారు. 

 

click me!