
కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్రంలో గల్లైంతన నలుగురు మత్స్యకారుల ఆచూకీ లభించినట్టుగా సమాచారం. వారు క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కనిపించకుండాపోయిన మత్స్యకారులు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా సమాచారం. అమలాపురం కొత్తపాలెం వద్ద ఉన్నట్టుగా వారు బోట్ యజమానికి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పలు తెలుగు న్యూస్ చానల్స్ రిపోర్ట్ చేశాయి. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక, మచిలీపట్నం క్యాంప్‌బెల్‌పేటకు చెందిన మత్స్యకారులు చిన్న మస్తాన్, చిన్న నాంచారయ్య, నరసింహారావు, వెంకటేశ్వరరావులు జూలై 2న రెండు చిన్న పడవల్లో సముద్రంలోకి వెళ్లారు. అంతర్వేదికి చేరుకున్న మత్స్యకారులు మచిలీపట్నంకు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. జూలై 3వ తేదీ రాత్రి 7.30 గంటలకు వారి నుంచి చివరి సమాచారం అందింది. అంతర్వేది దగ్గర బోటు మోటార్ పనిచేయడంలేదని బోట్ యజమానికి మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వారి ఫోన్లు కూడా పనిచేయలేదు.
ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. రోజులు గడుస్తున్న వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. మత్స్యకారుల ఆచూకీ కోసం ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు కాకినాడ తీరం సమీపంలో రెండు హెలికాప్టర్లతో గాలింపు ముమ్మరం చేశారు.
కోస్ట్‌గార్డ్‌కు చెందిన ప్రియదర్శిని, వీర అనే రెండు బోట్లు అన్వేషణ కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఇళ్లను మాజీ మంత్రి పేర్ని నాని సందర్శించి వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.