ఎన్టీఆర్ విగ్రహధ్వంస వివాదం గుడ్లవల్లేరులో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. లారీ ఢీ కొట్టి ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం అయ్యింది. అయితే అది కావాలనే చేశారని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు.
అమరావతి : గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు దారుణం జరిగింది. ఓ లారీ అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమయ్యింది. ఈ విషయంలో తెలిసిన వెంటనే టీడీనీ గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరావు, గుడ్లవల్లేరు తెలుగుదేశం పార్టీ నాయకులు గుడ్లవల్లేరు చేరుకున్నారు.
దీనిమీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఘటన మీద దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వాటర్ ప్లాంట్ దగ్గరున్న సిసి టీవీ పుటిజ్ పరిశీలించగా ఎన్ టి ఆర్ విగ్రహాన్ని హుస్సేన్ పాలెంకి చెందిన టిప్పర్ లారీ ఢీ కొట్టినట్లు గుర్తించామని ఎస్ఐ తెలిపారు. ఫుటేజీ ఆధారంగా సదరు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు.
అయితే, సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన టీడీపీ నేతలు కావాలనే లారితో గుద్దినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా వెళ్లాల్సిన లారీ సరిగ్గా విగ్రహం దగ్గరికి వచ్చేసరికి ఎలా అదుపుతప్పిందని.. ఇది కావాలనే చేసినట్లుగా ఉందని ఎన్టీఆర్ అభిమానులుకూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, గన్నవరం మండలం పురుషోత్తపట్నం- కొండపాలూరు బాబు జగజ్జివన్ రావు విగ్రహం వద్ద నెలకొన్న వివాదంలో అర్ధరాత్రి పోలీసులు బలగాలు గ్రామస్తులను చెదరగొట్టారు. వివాదం నేపథ్యంలో ఇరు గ్రామాల పెద్దలతో నూజివీడు ఆర్టీవో రాజ్యలక్ష్మి, తూర్పు ఏసిపి విజయ్ పాల్ చర్చలు జరిపారు.
చర్చలు విఫలమవడంతో ఇరు గ్రామస్తులను గన్నవరం పోలీసులు వారి ఇళ్లకు పంపివేశారు. అనంతరం ఎలాంటి వివాదాలు తలెత్తకుండా బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద పోలీసు బలగాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని రెండు గ్రామాల మహిళలు భయాందోళనతో ఉన్నారు.