విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి రాజమహేంద్రవరంలో అదృశ్యం అయిన ఘటన కలకలం రేపుతోంది. కారులో ఓ లెటర్ రాసిపెట్టి అతను కనిపించకుండా పోయాడు.
రాజమహేంద్రవరం : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లేఖ రాసి విశాఖకు చెందిన ఓ వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అదృశ్యమయ్యాడు. టూ టౌన్ సిఐ ఆర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…శుక్రవారం వేకువజాము నుంచి ఓ కారు రోడ్డు, రైలు వంతెనపై నిలిచి ఉండడంతో బండిపై అటుగా వెడుతున్న ఓ వ్యక్తికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించారు. పోలీసులకు కారులో ఒక చిన్న కాగితం లభించింది. ఆర్థిక సమస్యల కారణంగా చనిపోవాలని నిర్ణయించుకున్నానని, గోదావరిలో దూకేస్తానని తన భార్యకు ఈ విషయం చెప్పాలని రాసి ఉంది.
కారులో బ్యాంకు పాస్ బుక్, ఇతర ఆధారాలతో ఆ వ్యక్తి విశాఖపట్నంలోని కిర్లంపూడి లేఅవుట్ కు చెందిన కాట్రగడ్డ చంద్రశేఖర్(61)గా పోలీసులు గుర్తించారు. ఆయన గోదావరినదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారా? ఇంకెక్కడికైనా వెళ్లిపోయారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. వంతెన కింద నదిలో గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. అప్పుల కారణంగా చంద్రశేఖర్ గతంలోనూ ఓసారి ఇలాగే చేసి తిరిగి ఇంటికి వచ్చేశాడు అని ఆయన భార్య చెబుతున్నారని సీఐ తెలిపారు. చంద్రశేఖర్ కు రాజకీయ, స్తిరాస్తి వ్యాపార ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఈయన హామీగా ఉండి కొందరికి అప్పులు కూడా ఇప్పించినట్లు సమాచారం. ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.