ఆన్లైన్ లోనే సర్వదర్శనం టోకెన్లు... శ్రీవారి భక్తులకు టిటిడి ఛైర్మన్ శుభవార్త

By Arun Kumar PFirst Published Sep 22, 2021, 5:00 PM IST
Highlights

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సర్వదర్శన టోకెన్లను ఈ నెల 25వ తేదీ నుండి ఆన్ లైన్ లో విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు.

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి (Tirumala Venkateshwara Swamy) దర్శనం కోసం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ (TTD) చైర్మన్ వైవి సుబ్బారెడ్డి (YV Subba Reddy) ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు  26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు (Sarvadarshan Tokens) ఆన్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత సెప్టెంబరు 26వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామని ఆయన తెలిపారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ దర్శన సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని చైర్మన్ వివరించారు. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇక అక్టోబరు నెలకు సబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. 

read more  తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఎగబడుతున్న తమిళులు.. టీటీడీ యాక్షన్ ఇది

మరోవైపు తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద దాత శేఖ‌ర్‌రెడ్డి రూ.15 కోట్ల విరాళంతో నిర్మిస్తున్న గోమందిరాన్ని శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని గోమందిరం, పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రి, డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ కేంద్రంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను బుధ‌వారం ఈవో ప‌రిశీలించారు.

 ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ... గోమందిరంలో గోప్ర‌ద‌క్షిణ‌, గోతులాభారం, గోవు ప్రాశ‌స్త్యాన్ని భ‌క్తుల‌కు తెలియ‌జేసేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. బ‌ర్డ్ ఆసుప‌త్రి ఆవ‌ర‌ణంలో పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రి నిర్మాణానికి సంబంధించిన సివిల్ ప‌నులు పూర్త‌య్యాయ‌ని, వైద్య ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుకుని, వైద్యుల నియామ‌కం కోసం నోటిఫికేష‌న్ జారీ చేశామ‌ని చెప్పారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఈ ఆసుప‌త్రిని ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. అదేవిధంగా, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీకి తిరుప‌తిలోని డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌లో ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి ఈవో జవహర్ రెడ్డి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

 

click me!