ఏపీ హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వంఅమలుచేయాలని లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ కోరారు.
విజయవాడ: రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చిందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ చెప్పారు.ఆదివారం నాడు విజయవాడలో లోక్ సత్తా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.రాష్ట్రప్రభుత్వం రాజధానిపై ప్రజలను గందరగోళంలోకి నెట్టిందన్నారు. రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రాజధానిని మార్చే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకుండా అప్పులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అభివృద్దిని విస్మరించవద్దని ఆయన కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని విపక్షాలుడిమాండ్ చేస్తున్నాయి.అమరావతిలోనే రాజధాని డిమాండ్ తో అమరావతి పరిరక్షణ జేఏసీ పాదయాత్ర నిర్వహిస్తుంది. అమరావతి నుండి అరసవెల్లికి రైతులు పాదయాత్రలు చేస్తున్నారు. ఈ పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ మూడు రాజధానులకు అనుకూలంగా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.మూడు రాజధానులకు అనుకూలంగా జేఏసీ కూడా ఏర్పాటైంది. జేఏసీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.