
ప్రతిపక్ష నేత జగన్ తనపై చేసిన ‘లో క్యాష్ ’ఆరోపణకు రాష్ట్ర ఐటి, పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.నిన్న గుంటూరులో రెండురోజుల రైతు దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడుతూ వైపిసినేత లోకేష్ మీద సంచలన వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే.
క్యాష్ లేకుండా లోకేశ్ ఒక్క పని చేయడం లేదని అందుకే ఆయన పేరు లో‘క్యాష్’ అన్నారు.
అందుకే, ఆయన లోకేష్ కాదు, లోక్యాష్ అని జగన్ అన్నారు.
దీనితో పై ఈ రోజు లోకేశ్ నాయుడు స్పందించారు. ప్రతిసవాల్ వదిలారు.
‘నా పై చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా జగన్ నిరూపించాలి. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ’ అని డిమాండ్ చేశారు.
జగన్ మీద ఎదురు దాడి చేస్తూ, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల ప్రజాధనాన్ని జగన్ దోచుకున్నాడని, అందుకే ముఖ్యమంత్రుల కొడుకులంతా అలాగే చేస్తారని భ్రమపడుతున్నాడని లోకేశ్ అన్నారు.
‘పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లుగా జగన్‌కు అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తున్నారు,’ అని లోకేశ్ విమర్శించారు.
‘11 ఛార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉండి.. 16 నెలలు జైలు జీవితం గడిపి వచ్చిన జగన్ చరిత్రను ప్రజలెవరూ మర్చిపోతారా. నా పై ఆయన చేసిన విమర్శలకు నా పనితీరుతోనే సమాధానం చెబుతాను. చిత్తశుద్ధి లేకుండా జగన్ రెండు రోజుల పాటుదీక్ష చేసినా రైతులెవరూ రాలేదని లోకేశ్ అన్నారు.