స్థానికసంస్థల వాయిదా... మాజీ ఎన్నికల కమీషనర్ తో జగన్ మంతనాలు

By Arun Kumar PFirst Published Mar 16, 2020, 5:55 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో స్ధానికసంస్ధల ఎన్నికలు జరిపి తీరాలన్న పట్టుదలతో వుంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా మాజీ ఎన్నికల కమీషనర్ రమాకాంత్ రెడ్డితో చర్చించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసిపి ప్రభుత్వం, నాయకులు  సీరియస్ అవుతున్నారు. 

అంతేకాకుండా ఈసీ నిర్ణయంపై న్యాయపోరాటికి కూడా ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే ఏపి హైకోర్టు, సుప్రీంకోర్టులను వైసిపి ప్రభుత్వం, నేతలుఆశ్రయించారు. ఇంతటితో ఆగకుండా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర మాజీ ఎన్నికల కమీషనర్ రమాకాంత్ రెడ్డితో జగన్ చర్చిస్తున్నారు. 

ఎన్నికల వాయిదాపై ఎలా వ్యవహరిస్తే మంచిదన్న దానిపై రమాకాంత్ రెడ్డి సలహాలు, సూచనలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఈ భేటీలో మంత్రులు పెద్డిరెడ్డి రామచంద్రరెడ్డి, బొత్స సత్యనారాయణలు పాల్గొన్నారు.  క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. 

read more   అంతుచూస్తానంటూ ఈసీకి చంద్రబాబు బెదిరింపులు... అందువల్లే...: పేర్ని నాని

స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ప్రకటించడంపై ఇప్పటికే సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించి ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. అలాగే గవర్నర్ బిశ్వభూషణ్ ను ని కలిసి ఈసీ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. 

 ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పిటిషన్ ను కూడా జగన్ ప్రభుత్వం దాఖలుచేసింది.. స్థానిక సంస్థల ఎన్నికలను  జరిపించాలని కోరుతూ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం దాని మీద విచారణ చేపడతామని తెలిపింది.  

ఇక జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... ఎన్నికల కమీషనరేట్‌లో ఉన్న సెక్రటరీకి ఇలాంటి ఆర్డర్ ఒకటి తయారవుతున్నట్లు తెలియదని.. ఎవరో రాస్తున్నారని, ఎవరో ఆదేశాలు ఇస్తున్నారని... దాన్నే రమేశ్ కుమార్ చదువుతున్నారని సీఎం ఆరోపించారు. ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు సీఎం జగన్.

ఈయనను తమ ప్రభుత్వం నియమించలేదని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నియమించారని జగన్ గుర్తుచేశారు.

read more  జగన్ కే నా సపోర్ట్... ఈసీ చేస్తున్నదే కరెక్ట్ కాదు: జెసి సంచలనం

 ఎన్నికల కమీషనర్‌కు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం నిష్ఫాక్షకతని.. అదే సమయంలో రమేశ్ విచక్షణ సైతం కోల్పోయారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఏదైనా అధికారి విధులు నిర్వర్తించేటప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయాలని అలాంటప్పుడే ఆ వ్యక్తికి లేదా అధికారికి గౌరవం కలుగుతుందన్నారు.

రమేశ్ కుమార్ ఒకవైపు కరోనా వైరస్ కారణంగానే ఎన్నికలను వాయిదా వేస్తున్నానని చెప్పి,  అదే ప్రెస్‌మీట్‌లో గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు మరికొంతమంది అధికారులను బదిలీ చేస్తూ ప్రకటన చేశారని సీఎం ధ్వజమెత్తారు.ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల అధికారి విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చునని జగన్ సూచించారు. 151 మంది ఎమ్మెల్యేల బలంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి పవర్ ఉంటుందా.. రమేశ్ కుమార్ అనే అధికారికి ఉంటుందా అని సీఎం ప్రశ్నించారు.

 

click me!