ఎంతో పవిత్రంగా శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్న వేళ విజయవాడ ఆలయ ప్రాంగణంలో మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు కలకలం రేపుతున్నాయి.
విజయవాడ : ఎంతో పవిత్రంగా నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. రోజుకో రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇలా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కన్నులపండగగా దసరా శరన్నవరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. ఇలా ఎంతో భక్తిశ్రద్దలతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కంట మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు పడటం కలకలం రేపుతోంది. పోలీసులు, ఆలయ సెక్యూరిటీ సిబ్బంది పటిష్ట బందోబస్తును దాటుకుని ఇంద్రకీలాద్రి కొండపైకి మద్యం సీసాలు చేరాయి.
కనకదుర్గమ్మ వెలిసిన ఇంద్రకీలాద్రి కొండపైకి మద్యం, సిగరెట్లు తీసుకెళ్లడం నిషిద్దం. కానీ కొందరు తాగుబోతులు అమ్మవారి దర్శనానికి వెళ్లేమార్గంలో మరుగుదొడ్లలో మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం చేస్తున్నారు. బాత్రూంలలోనే ఈ మందు బాటిల్స్, సిగరెట్ పీకలు, డబ్బాలు పడేస్తున్నారు. ఇలా ఆలయ ప్రాంగణంలో అపవిత్ర పనులు చేస్తున్నా ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
undefined
వీడియో
అయితే తాజాగా ఓ వ్యక్తి కొండపై మద్యం బాటిల్స్ తో సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడినట్లు తెలుస్తోంది. కానీ నవరాత్రి వేడుకల వేళ ఈ విషయం బయటకు వస్తే తమ పరువు పోతుందని ఆలయ అధికారులు గోప్యంగా వుంచినట్లు సమాచారం. ఎంతో పవిత్రంగా భావించే ఇంద్రకీలాద్రిపై మందుబాబుల ప్రవేశం భక్తుల మనోభావాలనే దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆలయ అధికారులు కొండపైకి మద్యం, సిగరెట్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అమ్మవారి దర్శనంకోసం వచ్చే భక్తులు, హిందు సంఘాలు కోరుతున్నాయి.