
అమరావతి: సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేపైనే వైసిపి మహిళా జడ్పిటిసి తీవ్ర ఆరోపణలు చేసారు. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి (peddireddy dwarakanath reddy) నుండి తన భర్తతో పాటు కుటుంబం మొత్తాన్ని ప్రాణహాని వుందని వైసిపి (ycp) పార్టీకే చెందిన స్థానిక జడ్పిటిసి మద్దిరెడ్డి గీత (maddireddy geetha) ఆరోపించారు. ఎమ్మెల్యే బారినుండి తమకు రక్షణ కల్పించాలని సదరు మహిళా జడ్పిటిసి తన పార్టికే చెందిన ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు.
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆదేశాలతో తన భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డి (maddireddy kondreddy)పై అక్రమంగా ఫోర్జరీ కేసు నమోదుచేసిన పోలీసులు శనివారం ఇంటికివచ్చి అరెస్ట్ చేసారని జడ్పిటిసి గీత ఆందోళన వ్యక్తం చేసారు. ఇలా అక్రమంగా అరెస్ట్ చేసిన తన భర్తను రాత్రి సమయంలో జడ్జి ముందు హాజరుపర్చి మదనపల్లె సబ్ జైలుకు తరలించారని తెలిపారు. అక్కడ పోలీసుల సాయంతో ఎమ్మెల్యే అనుచరులు తన భర్తకు ఏమయినా ప్రమాదం తలపెట్టవచ్చని ఆమె అనుమానం, ఆందోళన వ్యక్తం చేసారు.
తన భర్త కొండ్రెడ్డికి ఏం జరిగినా ప్రభుత్వం, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పోలీసులు బాధ్యత వహించాల్సి వుంటుందని జడ్పిటిసి గీత హెచ్చరించారు. తమ ఇంటికొచ్చే వారినీ, జామీను ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారినీ ఎమ్మెల్యే అనుచరులు చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారని అన్నారు. తన భర్త అక్రమ అరెస్ట్ పై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని గీత తెలిపారు.
read more వంగవీటి రాధా హత్యకు రెక్కీ.. మాకు ఏ ఆధారాలు దొరకలేదు : విజయవాడ సీపీ క్రాంతి రాణా
తమకు ఎవరు అడ్డొచ్చినా ఇదే పరిస్థితి వుంటుందని... గవర్నమెంటే తమదంటూ అక్రమంగా కేసులు బనాయించి వేదిస్తున్నారని జడ్పిటిసి గీత ఆరోపించారు. ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి కంటే ముందునుండే తాము వైసిపి పార్టీలో వున్నామని... మా తర్వాతే ఆయన వైసిపి నాయకుడని గీత అన్నారు. వైసిపి పుట్టినప్పటి నుంచీ పార్టీలోనే ఉన్నాం... 2013లో సర్పంచి ఎన్నికల్లో గెలిచామని గుర్తుచేసారు. ఇప్పుడు జడ్పీటీసీగా కొనసాగుతున్నా... ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురయినా పార్టీ శ్రేయస్సుకోసమే పనిచేశామని గీత పేర్కొన్నారు.
మదనపల్లె పంచాయతీ ఎన్నికల్లో తమ జట్టు విజయాన్ని మనసులో పెట్టుకునే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అక్రమంగా ఫోర్జరీ, 420 కేసులు పెట్టించి వేధిస్తున్నారని తెలిపారు. అధికారం చేతిలో ఉందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వైసిపి జడ్పిటిసి గీత ఆందోళన వ్యక్తం చేసారు.