
ప్రతిపక్ష వైసీపీ ఏం చెబితే చంద్రబాబునాయుడు అది చేస్తారా? భూమా మృతి తర్వాత తనపై వస్తున్న ఆరోపణలనుండి తప్పించుకునేందకు చంద్రబాబు ఎదురుదాడి మొదలుపెట్టారు. మంత్రిపదవి ఇవ్వని విషయంలో వైసీపీ చెప్పినట్లే చేసాను అన్న అర్ధం వచ్చేట్లు మాట్లాడారు. మంత్రిపదవి ఇవ్వకపోవటం వల్లే భూమా మరణించారని విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. అదే విషయమై మీడియా కూడా చంద్రబాబు వద్ద ప్రస్తావించింది. అందుకు చంద్రబాబు బదులిస్తూ, భూమాకు మంత్రిపదవి ఇవ్వద్దని వైసీపీనే చెప్పింది కదా అని సమాధానమివ్వటం విశేషం.
భూమాకు మంత్రి పదవి ఇవ్వొద్దని చెప్పిందీ వైసీపీనే ఇపుడు మంత్రిపదవి ఇవ్వకపోవటం వల్లే చనిపోయాడని చెప్పటమేంటని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. భూమాకు మంత్రిపదవి ఇవ్వొద్దని వైసీపీ చెప్పిందనే అనుకుందాం. అదే నిజమైతే మరి ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామా చేయించాలని కూడా వైసీపీ చాలా సార్లు డిమాండ్ చేసింది. ఫిరాయింపు ఎంఎల్ఏను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చింది. మరి ఆ విషయాలను ఎందుకు చంద్రబాబు పట్టించుకోలేదు. సంతాప సభకు వైసీపీ హాజరుకాకపోవటం తప్పే అనుకుంటే, దాన్ని రాజకీయం చేయటం టిడిపి చేస్తున్న తప్పు. మొత్తానికి సంతాప సందర్భాన్నికూడా రాజకీయం చేయవచ్చని అందరికీ తెలిసింది.
భూమాకు మంత్రిపదవి ఇస్తానని ప్రలోభపెట్టి వైసీపీ నుండి టిడిపిలోకి చంద్రబాబు లాక్కున్నది వాస్తవం. ఆ విషయంగా ఇద్దరి మధ్యా చాలాసార్లే చర్చ జరిగిందట. ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రిపదవి ఎలా ఇస్తారని చంద్రబాబును గవర్నర్ ప్రశ్నించినట్లు టిడిపినే ప్రచారంలో పెట్టింది. దానికితోడు బద్ద శత్రువైన శిల్పా చక్రపాణిరెడ్డికి కర్నూలు ఎంఎల్సీ సీటు ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత పెట్టటం కూడా భూమాపై ఒత్తిడి పెంచిదని పార్టీలో బాగా ప్రచారంలో ఉంది. భూమా మరణం తర్వాత తనపై వస్తున్న ఆరోపణలనుండి తప్పుకోవటానికి అసెంబ్లీలో భూమా సంతాప సమావేశానికి వైసీపీ గైర్హాజరవ్వటమన్న విషయాన్ని చంద్రబాబు వాడుకుంటున్నారు.