ఏపీలో 52 డ్రోన్‌లతో సమగ్ర భూ సర్వే .. ఇప్పటి వరకు పూర్తయ్యింది ఇదే : వివరాలు తెలిపిన మంత్రుల కమిటీ

By Siva KodatiFirst Published May 13, 2022, 9:19 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి సంబంధించి మంత్రుల కమిటీ కీలక విషయాలు వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 2,149 గ్రామాల్లో డ్రోన్ ద్వారా సర్వే పూర్తి చేశామని మంత్రులు  వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర భూ సర్వేకు (land survey in ap) ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనిలో సాధ్యాసాధ్యాల కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 52 డ్రోన్లతో (drones) సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని మంత్రుల కమిటీ శుక్రవారం తెలిపింది. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా (survey of india) , ఏపీ ప్రభుత్వం, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా 172 డ్రోన్లు సమకూర్చుకోనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 2,149 గ్రామాల్లో డ్రోన్ ద్వారా సర్వే పూర్తి చేశామని మంత్రుల కమిటీ వెల్లడించింది. 

756 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తి చేశామని.. దీనికి సంబంధించి ప్రజల నుంచి 9,283 విజ్ఞాపనలు అందాయని, వీటిలో 8,935 విజ్ఞప్తులను పరిష్కరించామని తెలిపింది. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో భాగంగా 18,487 సర్వే రాళ్లను పాతి హద్దులు నిర్ణయించామని వెల్లడించింది. ఏపీలోని 123 పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో 5,548.90 చదరపు కిలోమీటర్ల పరిధిలో 30 లక్షల నిర్మాణాలు వున్నాయని మంత్రుల కమిటీ పేర్కొంది. 

ALso Read:రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే: జగన్ సర్కార్ కీలక నిర్ణయం

అలాగే 13 జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా సర్వే కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొంది. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు  లేకుండా సమగ్ర భూ సర్వే పరిష్కారం చూపుతుందని మంత్రుల కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలు, గ్రామాల్లోని వ్యవసాయ భూములు, పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ భూములకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సర్వే ద్వారా నిర్ధారిస్తామని మంత్రుల కమిటీ చెప్పింది. 

సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ సర్వేను పకడ్భందీగా నిర్వహిస్తామని తెలిపారు. అలాగే అటవీ భూములకు సంబంధించి గతంలో జరిగిన అవకతవకలను కూడా జగనన్న భూహక్కు-భూరక్ష (Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha Scheme) ద్వారా సరిదిద్దుతామన్నారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించి, నిర్ధిష్టంగా సరిహద్దులను గుర్తించాలని, ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్లు తేలితే వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రుల కమిటీ ఆదేశించింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ పలువురు అధికారులు పాల్గొన్నారు. 

click me!